2022 రౌండప్: డబ్బింగ్ సినిమాలు ఇరగదీశాయ్!

ఈ ఏడాది తెలుగులో 3 బెస్ట్ సినిమాలు టకటకా చెప్పండి.. మీకు తెలియకుండానే అందులోకి ఓ డబ్బింగ్ సినిమా పేరు వచ్చి పడుతుంది. అదీ డబ్బింగ్ సినిమాల హవా. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు…

ఈ ఏడాది తెలుగులో 3 బెస్ట్ సినిమాలు టకటకా చెప్పండి.. మీకు తెలియకుండానే అందులోకి ఓ డబ్బింగ్ సినిమా పేరు వచ్చి పడుతుంది. అదీ డబ్బింగ్ సినిమాల హవా. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు తమ సత్తా చాటాయి. ఇంకా ఓపెన్ గా మాట్లాడుకుంటే.. కొన్ని స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా కాసులు కురిపించాయి.

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కేజీఎఫ్ ఛాప్టర్ 2 గురించే. టాలీవుడ్ లో అత్యథిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమా ఇదే. ఇంతకుముందే చెప్పుకున్నట్టు కొన్ని స్ట్రయిట్ సినిమాల కంటే ఈ మూవీకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ధాటికి, ఆ టైమ్ లో కొన్ని సినిమాల విడుదలలు కూడా వాయిదా వేసుకున్నారు. మొదటి సినిమాతో పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విడుదలైన కేజీఎఫ్-2, పార్ట్-1 కంటే పెద్ద విజయం సాధించింది.

కేజీఎఫ్-2 సక్సెస్ ను చాలామంది ఊహించారు. కానీ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి, ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా ఏదైనా ఉందంటే అది కాంతార మాత్రమే. కన్నడలో ఈ సినిమా ప్రభంజనం సృష్టించినంత వరకు దీని గురించి బయట ప్రపంచానికి తెలియదు. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అఖండ విజయాన్నందుకుంది. క్లయిమాక్స్, వరహా రూపం పాట ఈ సినిమాకు ఆయువుపట్టు.

ఇలాంటిదే మరో సినిమా లవ్ టుడే. పూర్తిగా యూత్ పల్స్ పట్టుకొని తీసిన సినిమా ఇది. కుర్రాళ్ల చేతిలో సెల్ ఫోన్లు కామన్. ప్రతి మనిషి ప్రైవేట్ జీవితం సెల్ ఫోన్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో.. ఇద్దరు ప్రేమికుల మధ్య సెల్ ఫోన్లు తారుమారు అయితే పరిస్థితేంటి? వాళ్ల లవ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సినిమా. పెళ్లికి రెడీ అయిన ఇద్దరు లవర్స్, సెల్ ఫోన్లు మారడంతో ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారనే విషయాన్ని హిలేరియస్ గా, యూత్ కు కనెక్ట్ అయ్యేలా తీసి పెద్ద హిట్ కొట్టారు.

ఈ ఏడాది హిట్టయిన డబ్బింగ్ సినిమాల్లో అవతార్-2 కూడా ఉంది. 13 ఏళ్ల కిందటొచ్చిన అవతార్ కు సీక్వెల్ గా అవతార్- ది వే ఆఫ్ వాటర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద హిట్టయింది. ఇప్పటికీ వసూళ్లు స్టడీగా వస్తున్నాయి. ఈ మూవీతో పాటు వచ్చిన సర్దార్, విక్రాంత్ రోణ సినిమాలు కూడా ఈ ఏడాది హిట్టయిన డబ్బింగ్ సినిమాల జాబితాలో ఉన్నాయి.

అయితే వీటితో పాటు ఫ్లాప్ అయిన డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన పొన్నియన్ సెల్వన్-1, బ్రహ్మాస్త్ర, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలు తెలుగులో ఆడలేదు.

మొత్తంగా చూసుకుంటే.. 2022లో టాలీవుడ్ స్క్రీన్ పై డబ్బింగ్ సినిమాలు తమ మార్క్ చూపించాయి. స్ట్రయిట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాసుల వర్షం కురిపించాయి. స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం డబ్బింగ్ సినిమాల వెంట పడేలా చేశాయి.