తెలుగు సినిమాలన్నీ పక్కకుపోయాయి. ఈ దీపావళికి టాలీవుడ్ లో రెండు తమిళ సినిమాలు పోటీపడ్డాయి. విజయ్ నటించిన విజిల్, కార్తి నటించిన ఖైదీ సినిమాలు దీపావళి కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో విజిల్ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ అల్టిమేట్ గా ఖైదీ సినిమాకు హిట్ టాక్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో విజిల్ సినిమాకు మొదటి రోజు 2 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. విజయ్ కెరీర్ లోనే టాలీవుడ్ కు సంబంధించి హయ్యస్ట్ ఓపెనింగ్ ఉంది. ఈ సినిమాతో తెలుగులో అతడికి మార్కెట్ ఏర్పడిందనే విషయం స్పష్టమౌతూనే ఉంది. దీనికి కారణం అతడు గతంలో చేసిన అదిరింది, సర్కార్, తుపాకి లాంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడడమే.
ఇక కార్తి విషయానికొస్తే.. ఖైదీ సినిమాకు ఏపీ, నైజాంలో మొదటి రోజు కేవలం 65 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. దీనికి కారణం రీసెంట్ గా అతడు నటించిన 2-3 సినిమాలు తెలుగులో ఫ్లాప్ అవ్వడమే. కానీ మొదటి రోజు వసూళ్లను బట్టి ఈ రెండు సినిమాల్లో విజిల్ హిట్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే, విజిల్ కంటే ఖైదీ సినిమాకు హిట్ టాక్ ఎక్కువగా ఉంది.
విజిల్ సినిమా కేవలం విజయ్ కోసం తీసినట్టుంది. విజయ్ మేనరిజమ్స్, మాస్ లుక్స్ ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కు మాత్రమే ఇది నచ్చుతుంది. కానీ ఖైదీ అలా కాదు. పూర్తిగా కథ, స్క్రీన్ ప్లే ఆధారంగా తీసిన సిసలైన థ్రిల్లర్. అందుకే ఈ సినిమాకు మౌత్ టాక్ గట్టిగా ఉంది.
సినిమా చూసిన వాళ్లెవరూ బాగాలేదని చెప్పడం లేదు. కనీసం యావరేజ్ అని కూడా అనడంలేదు. అంతా హిట్ అంటున్నారు. అలా విజిల్ సినిమా ఓపెనింగ్స్ తో మెప్పిస్తే.. ఖైదీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.