తాము మహారాష్ట్రలో విజయం సాధించామంటూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి కానీ.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష డిమాండ్ కు తలొగ్గక తప్పనిసరి పరిస్థితుల్లో కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. మొన్నటి వరకూ శివసేనను ఏ మాత్రం ఖాతరు చేయనట్టుగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా అయినా శివసేన తమ వద్దే పడుండాల్సిందే అన్నట్టుగా బీజేపీ వాళ్లు వ్యవహారించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అయితే మరీ బెట్టు చూపించిన దాఖలాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు శివసేనను కమలం పార్టీ మరీ లైట్ తీసుకునే అవకాశాలు లేవు. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించడమే శివసేనకు ప్రధాన లక్ష్యం. అందులోనూ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఈసారి ఎమ్మెల్యే కూడా పోటీచేశాడు. అతడు తమ సీఎం అభ్యర్థని ఫలితాల తర్వాత శివసేన వాళ్లు ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పీఠాన్ని అధిరోహించే అవకాశాలు సేనకు పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎన్సీపీ శివసేనను ఎగదోస్తూ ఉంది కూడా. సేనతో చేతులు కలిపే ఉద్ధేశం లేదని అంటోంది ఎన్సీపీ, అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని శివసేన అనుకోవడం తప్పులేదంటోంది ఎన్సీపీ.
ఇలా పరోక్షంగా ఆ పార్టీకి సిగ్నల్ ఇస్తున్నారు ఎన్సీపీ అధినేత. అయితే శివసేన-ఎన్సీపీ చేతులు కలిపినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కాబట్టి.. ఆగక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో సేన చేతులు కలపకతప్పని పరిస్థితే ఉన్నప్పటికీ.. సంకీర్ణ ప్రయాణం అంత సులభంగా ఉండదు బీజేపీకి!