ఎవరికి వాళ్లు ఇన్నాళ్లూ మనకెందుకులే అని దూరంగా ఉన్నారు. ఆ బిడియాన్ని మొదట చిరంజీవి పక్కనపెట్టేశారు. పాత జ్ఞాపకాలు, సవాళ్లు, రాజకీయ వైరుధ్యాలు.. పక్కనపెట్టేసి కుటుంబంతో సహా వచ్చి ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని కలసి వెళ్లారు. ఆ చర్చలు సైరా నరసింహారెడ్డి సినిమా గురించి కావచ్చు ఇంకేదైనా కావొచ్చు.. ఈ భేటీతో మెగాస్టార్ కుటుంబానికి జగన్ దగ్గర యాక్సెస్ పెరిగిందనేది మాత్రం వాస్తవం.
మెగా కుటుంబం వెళ్తే మిగతావాళ్లు ఊరుకుంటారా..? లేటైతే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, ముందే వెళ్తే ఏం ఉపయోగం ఉంటుందో.. అనుకుంటూ ఘట్టమనేని ఫ్యామిలీ లైన్లోకి వచ్చింది. సొంత బావ టీడీపీలో ఎంపీగా ఉండగా తానెందుకు అనుకున్నారో ఏమో.. మహేష్ బాబు మాత్రం వెళ్లలేకపోయారు. బిజినెస్ వ్యవహారాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ కంటే షార్ప్ గా ఉండే ఆ ఇంటి కోడలు నమ్రత శిరోద్కర్.. ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కలిశారు.
మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామానికి మరిన్ని సౌకర్యాలు అందించేందుకే ఈ భేటీ జరిగిందని వార్తలొస్తున్నా.. సినిమావాళ్లు లాభం లేనిదే ఏ చిన్న పనీ చేయరని అందరికీ తెలుసు. అప్పుడెప్పుడో శ్రీమంతుడు టైమ్ లో మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటినుంచీ అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. టీడీపీ హయాంలో ఏమేరకు పనులయ్యాయో తెలియదు కానీ, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఇప్పుడెందుకో హడావిడిగా నమ్రత వెళ్లి భారతిని కలిశారు.
చిరంజీవి సతీసమేతంగా జగన్ ని భేటీ అయిన తర్వాతే మహేష్ బాబు ఫ్యామిలీకి కూడా ఈ ఆలోచన వచ్చిందనే విషయం వేరే చెప్పక్కర్లేదు. సమాజ సేవ అయినా, వ్యక్తిగత విషయాలైనా.. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ఇన్నాళ్లకు జగన్ గుర్తుకురావడం సంతోషమే. చంద్రబాబో, పవన్ కల్యాణో అధికారంలోకి వస్తే సినీ ఇండస్ట్రీ ఎలా స్పందించి ఉండేదో అందరికీ తెలుసు, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని మాత్రం ఇంకా కొంతమంది సినీ పెద్దలు ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా జగన్ ముందు క్యూ కడుతున్నారు.
కారణాలేమైనా.. ముఖ్యమంత్రితో సఖ్యత కోసం సినీ ఇండస్ట్రీ చేస్తున్న ప్రయత్నాన్ని శుభపరిణామంగానే చెప్పుకోవాలి. మెగా కుటుంబం కలిసింది. ఘట్టమనేని కుటుంబం లైన్ క్లియర్ చేసుకుంది. నందమూరి కుటుంబం ఎలాగూ దూరం. ఇక మిగిలింది అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలే. నాగార్జున, వెంకటేష్, సురేష్ బాబు కూడా జగన్ ను కలిస్తే ఓ లాంఛనం పూర్తయినట్టే.