అసలు పేరు త్సునామీ. వాడుకలో సునామీ అయింది. ఈ పదం అందరికీ తెలిసి పద్దెనిదేళ్ళు పూర్తి అయింది. అది 2004 సంవత్సరం. డిసెంబర్ నెల 26. తెల్లవారుతూనే విశాఖవాసులకు భూమి కదిలినట్లు అయింది. అలా నెమ్మదిగా స్వల్ప భూకంపం వచ్చింది. దాంతో జనాలు ఆందోళనకు గురి అయ్యారు.
మరో వైపు చూస్తే సముద్రంలో అలజడి రేగింది. తీరం దాకా దూసుకొచ్చిన కెరటాలు. ఒడ్డున లంగరేసి కట్టిన పడవులు అన్నీ చిద్రమైపోయాయి. రాళ్ళను తోసుకుంటూ దాదాపుగా బీచి వద్ద ఉన్న రోడ్డు దాకా కెరటాలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
అంతే సముద్రంపు ఒడ్డున ఉన్న కుటుంబాలు మత్య్సకారులు అంతా కూడా తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ఏదో జరగబోతోందని ఊహించి భయపడి వణికారు. ఇక ప్రచారం చూస్తే జగదాంబా జంక్షన్ దాకా కెరటాలు దూసుకువచ్చేస్తునాయని. అయితే అదంతా అవాస్తవం. తీరం దాటి కొద్దిగా ముందుకు మాత్రమే కెరటాలు వచ్చాయి. ఏదేమైనా ప్రశాంత విశాఖ సాగరం మాత్రం ఆ రోజు గందరగోళంగా ఉంది అది తలచుకుంటే ఈ రోజుకీ కూడా కలవరం ఒళ్ళంతా రేగుతుంది. డిసెంబర్ 26ను పురస్కరించుకుని నగర మేయర్ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆనాడు సునామీ ప్రభావం విశాఖపట్నం పై బాగా పడిందని మేయర్ హరి వెంకట కుమారి గుర్తు చేసుకున్నారు. ఇటువంటి సునామీలు రాకుండా గంగమ్మ తల్లికి గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు తోపాటు పాలాభిషేకం చేశామన్నారు. సముద్రంలో భూకంపాల వల్ల సునామీ వస్తుందన్న సంగతి ఇపుడు అందరికీ అవగాహన ఉందని, ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్లనే నాడు ప్రపంచంలోని పలు దేశాల్లో అధిక ప్రాణ నష్టం జరిగిందని మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు.