ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీఎంట్రీ….అక్క‌డి నుంచి పోటీ!

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పొలిటిక‌ల్ రీఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. గ‌తంలో ఆయ‌న విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే అభిమానం…

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పొలిటిక‌ల్ రీఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. గ‌తంలో ఆయ‌న విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే అభిమానం పెంచుకున్నారు. వైఎస్సార్ పాద‌యాత్ర‌లో పూర్తిగా అడుగులో అడుగు వేసిన ఇద్ద‌రు ముగ్గురు నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ను అడ్డుకోడానికి వీరోచిత పోరాటం చేసిన నాయ‌కుడిగా ల‌గ‌డ‌పాటికి పేరుంది. లోక్‌స‌భ‌లో విభ‌జ‌న బిల్లు ఆమోదం పొందే సంద‌ర్భంలో తెలంగాణ ఎంపీల క‌ళ్ల‌లో పెప్ప‌ర్ స్ప్రే కొట్టి… ర‌భ‌స సృష్టించారు. ఒక‌వేళ తెలంగాణ ఏర్ప‌డితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌తిజ్ఞ చేశారు. అన్న‌ట్టుగానే ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రించారు.

అయితే 2004 నుంచి ఆయ‌న ఎన్నిక‌ల స‌ర్వేలు చేస్తున్నారు. స‌ర్వేలు చేయ‌డం ఆయ‌న‌కు హాబీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి వ్య‌తిరేక రిపోర్టులు వ‌చ్చినా చెప్పేవారు. కాంగ్రెస్ నాయ‌కుడై ఉండి కూడా నిష్ప‌క్ష‌పాతంగా చెబుతార‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ 2019లో ఏపీ ప్ర‌జానీకం నాడిని ప‌ట్టుకోవ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. మ‌ళ్లీ టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. కానీ టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన త‌ర్వాత ఆయ‌న కీల‌క ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు. 2014 నుంచి కొన్ని సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఏ రాజ‌కీయ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాను చేసిన స‌ర్వేలు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని అన్నారు. వాళ్ల నాడిని ప‌ట్టుకోలేక‌పోయిన కార‌ణంగా ఇక‌పై స‌ర్వేలు చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

అప్ప‌టి నుంచి ల‌గ‌డ‌పాటి అడ‌పాద‌డ‌పా క‌నిపించ‌డం త‌ప్ప‌, ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు, లోకేశ్‌తో ఇటీవ‌ల ల‌గ‌డ‌పాటి భేటీ అయ్యార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుంచి ల‌గ‌డ‌పాటి బ‌రిలో దిగ‌నున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం అక్క‌డ టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌నంటే టీడీపీ నేత‌లెవ‌రికీ గిట్ట‌డం లేదు.

దీంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో కేశినేని నాని కుమార్తెకు ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చి, ల‌గ‌డ‌పాటిని ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాల‌ని టీడీపీ భావిస్తోంది. ఈ మేర‌కు టీడీపీ పెద్ద‌ల‌తో ల‌గ‌డ‌పాటి చ‌ర్చ‌లు విజ‌య‌వంతంగా ముగిసిన‌ట్టు తెలిసింది. రానున్న రోజుల్లో ల‌గ‌డ‌పాటి మ‌ళ్లీ త‌న మార్క్ రాజ‌కీయాన్ని ఏపీ ప్ర‌జానీకానికి రుచి చూపించ‌నున్నారు.