గతంలో ప్రజారాజ్యం ఏ విధంగా అయితే దెబ్బతిన్నదో, ఇప్పుడు జనసేనకు కూడా అదే చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్‌ను కాపు నాడు నిండా ముంచిందనే అభిప్రాయాలు జనసేన నుంచి వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కాపునాడు సభను గ్రహిస్తే… పవన్‌కు జరిగిన నష్టమేంటో గ్రహించొచ్చు. కాపునాడు సభ బ్యానర్లో దివంగత వంగవీటి మోహనరంగాతో మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్‌కల్యాణ్ ఫొటోలున్నాయి.
పవన్‌కల్యాణ్‌కు కులపరంగా మనసులో భావన ఎలా ఉన్నా, పైకి మాత్రం తాను కుల రహిత నాయకుడిగా చెప్పుకుంటుంటారు. అందరి అభిమానాన్ని పొందాలనుకునే నాయకుడెవరైనా ఇలాగే చెప్పాలి. అయితే కాపునాడు నాయకుల అత్యుత్సాహం పవన్‌ను కేవలం ఒక సామాజికవర్గ నాయకుడనే ముద్రను బలంగా వేసింది. అందుకే ఈ సభకు మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ సభ రాజకీయాలకు అతీతంగా చేపట్టినట్టు కాపు నాడు నేతలు ప్రకటించారు.
కానీ వేదికపై బ్యానర్ ఫొటోలు, అలాగే పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా నిలవాలన్న వక్తల ప్రసంగాలు ….ఇది ముమ్మాటికీ జనసేనాని కోసం నిర్వహించిన సభ అనే సందేశం వెళ్లింది. ఒక్కసారి కుల ముద్ర పడితే ఇతర కులాల ఆదరణ పొందడం అసాధ్యం. ఇదే జనసేనకు ప్రమాదం.
గతంలో ప్రజారాజ్యం కూడా ఇదే కారణంతో దెబ్బతిన్నది, ఇప్పుడు ఆ దుస్థితి జనసేనకు వస్తున్న సంకేతాలు విశాఖ సభతో స్పష్టమైంది. పవన్‌పై అభిమానంతో కాపులందరినీ ఏకం చేయాలన్న ఉద్దేశంతో ఈ సభ నిర్వహించారు. ఇదే సందర్భంలో మిగిలిన కులాలను దూరం చేసేలా సభ నడిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.