ఇవాళ్టి విశాఖ కాపునాడు సభ హీరో ఎవరంటే… బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అని చెప్పక తప్పదు. ఇటీవల రాజ్యసభలో కాపుల ఐదు శాతం రిజర్వేషన్‌పై ప్రశ్నించి, వారి ఆకాంక్షలను అత్యున్నత చట్ట సభలో వినిపించిన జీవీఎల్‌పై కాపునాడు సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కాపు నాడులో ప్రత్యేకంగా జీవీఎల్ కృషిని వక్తలు ఆకాశమే హద్దుగా పొగడ్తలతో ముంచెత్తారు. జీవీఎల్‌కు పాదాభివందనాలని కాపు నేతలు చెప్పడం గమనార్హం.
మరీ ముఖ్యంగా ఈ సభకు హాజరైన వారిలో జీవీఎల్ మాత్రమే అంతోఇంతో ప్రముఖుడు. మిగిలిన వారంతా ఆ సామాజికవర్గానికి పరిమితమైన నేతలు కావడం గమనార్హం. భవిష్యత్‌లో తమ గళాన్ని రాజ్యసభలో వినిపించాలని కాపు నేతలు జీవీఎల్‌ను అభ్యర్థించడం విశేషం. ఈ సందర్భంగా జీవీఎల్‌ను సత్కరించారు. జీవీఎల్ ప్రసంగమంతా కాపుల మనసుల్ని చూరగొనేలా సాగింది.
వైఎస్సార్, ఎన్టీఆర్ అంటే తనకు గౌరవమని, వాళ్లిద్దరి పేర్లను జిల్లాలకు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ప్రజానాయకుడైన వంగవీటి మోహనరంగా పేరును ఎందుకని కృష్ణా జిల్లాకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు కాపు నేతలకు పదవులు వస్తున్నాయని, కానీ వారి చేతిలో పవర్ లేదని విమర్శించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో రంగా విగ్రహాన్ని పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే స్టాలిన్ సినిమాలో గిరి గీసి నాయకుల్ని పెట్టినట్టు, ఏపీలో కూడా కాపు నాయకుల్ని వైసీపీ, టీడీపీ నేతలు గిరిగీసి పెట్టాయని విమర్శించారు. ఆ గిరి నుంచి బయటికొస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా అధిక జనాభా కలిగిన సామాజిక వర్గ నాయకులే సీఎం అవుతుంటారని, కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి వుందన్నారు. ఇదిలా వుండగా తమ జాతి చిరకాల కోరికైన రిజర్వేషన్ల కల సాకారం అయ్యేందుకు సహకరించాలని జీవీఎల్‌ను కాపు నేతలు కోరారు.