2022 రౌండప్: సెలబ్రిటీ పెళ్లిళ్లు

గతేడాదిలానే ఈ ఏడాది కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లు జోరుగా సాగాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ నుంచి సౌత్ సెన్సేషన్ నయనతార వరకు చాలామంది 2022లో పెళ్లిపీటలెక్కారు. లిస్ట్ లో ఈసారి కొన్ని…

గతేడాదిలానే ఈ ఏడాది కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లు జోరుగా సాగాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ నుంచి సౌత్ సెన్సేషన్ నయనతార వరకు చాలామంది 2022లో పెళ్లిపీటలెక్కారు. లిస్ట్ లో ఈసారి కొన్ని సర్ ప్రైజ్ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసిన వివాహం ఏదైనా ఉందంటే అది నయనతారది మాత్రమే. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో దాదాపు ఏడేళ్లుగా ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. నయన్-విఘ్నేష్ జూన్ లో పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవాతో వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన తర్వాత, టోటల్ గా మీడియాకు ముఖం చాటేసిన నయనతార, విఘ్నేష్ ను పెళ్లాడిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చింది. అన్నట్టు మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సరోగసీ ద్వారా వీళ్లిద్దరూ పెళ్లయిన 5 నెలలకే తల్లిదండ్రులుగా కూడా మారారు.

ఈ ఏడాది ఆశ్చర్యకర వివాహాల్లో అలియా భట్ కూడా ఉంది. ప్రియుడు రణబీర్ ను పెళ్లాడింది అలియాభట్. కుటుంబ సభ్యులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీళ్ల పెళ్లి గుంభనంగా జరిగింది. పెళ్లి జరిగిన 2 రోజులకే ఇద్దరూ షూటింగ్స్ లో కూడా జాయిన్ అయిపోయారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే అలియా, తను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది. ఇదే ఏడాదిలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అలా ఒకే ఏడాదిలో పెళ్లితో పాటు తల్లి కూడా అయింది.

నాగశౌర్యది కూడా సర్ ప్రైజ్ వెడ్డింగే. తన సినిమా ప్రచారంలో కూడా పెళ్లి పుకార్లు ఖండించిన ఈ హీరో, ఆ వెంటనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. చెప్పిన 3 రోజులకే ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన అనూష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శౌర్య. నవంబర్ లో వీళ్ల పెళ్లి జరిగింది.

చాన్నాళ్లుగా పెళ్లిపై సస్పెన్స్ మెయింటైన్ చేసిన హన్సిక కూడా 2022లో పెళ్లి చేసుకుంది. తాజాగా జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ లో హన్సిక, ఆమె బాయ్ ఫ్రెండ్ సోహెల్ పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త అయిన సోహైల్, హన్సికతో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీపెట్టాడు. అలా ఇద్దరూ కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ ఓ రెస్టారెంట్ బిజినెస్ కూడా ప్రారంభించారు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, పెళ్లికి దారితీసింది.

హీరో ఆది పినిశెట్టి కూడా ఈ ఏడాదిలోనే ఓ ఇంటివాడయ్యాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని వాళ్లు బయటకు చెప్పలేదు. లాక్ డౌన్ టైమ్ లో మరింత బాగా అర్థం చేసుకున్న తర్వాత, ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. మీడియాకు చెప్పి మరీ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు, ఈ ఏడాది మే నెలలో పెళ్లితో ఒకటయ్యారు.

ఈ ఏడాది పూర్ణ కూడా పెళ్లి చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా పూర్ణకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. కానీ మంచి సంబంధాలు సెట్ అవ్వలేదు. ఎట్టకేలకు దుబాయ్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది పూర్ణ. అతడితో కలిసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది.

కొన్నాళ్ల పాటు కోలీవుడ్ నటుడు గోకుల్ ఆనంద్ తో డేటింగ్ చేసిన మధుశాలినీ కూడా ఈ ఏడాది, ఆ బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ తారలు, టెలివిజన్ ఆర్టిస్టులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

హీరోయిన్ మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తీక్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. వీళ్ల లవ్ ఎఫైర్, టాలీవుడ్ లో ఓపెన్ సీక్రెట్. అలా మీడియాకు తెలిసీతెలియనట్టు పెళ్లి చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది ఒక్కటైంది. 2019లో వచ్చిన దేవరాట్టమ్ అనే సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అప్పుడే మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్నుంచి డేటింగ్ లో ఉన్న వీళ్లిద్దరూ, ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు.

ఇక హీరోయిన్ మౌని రాయ్, తన ప్రియుడు సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. బెంగాలీ, మలయాళీ సంప్రదాయాల్లో వీళ్ల వివాహం జరిగింది. ఇక బాలీవుడ్ నుంచి ఫర్హాన్ అక్తర్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్లుగా షిబానీ దండేకర్ తో డేటింగ్ చేస్తున్న ఫర్హాన్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖండాలాలో సింపుల్ గా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఎప్పట్లానే ఈ ఏడాది కూడా కొంతమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లకు దూరంగా ఉన్నారు. ప్రభాస్ ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోలేదు. అనుష్క కూడా అంతే. హీరోయిన్లు రకుల్, పాయల్, అవికా గౌర్ కూడా ప్రస్తుతం లవ్ లైఫ్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ఏడాదిలో వీళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారేమో.