ఈసారి.. అర్థరాత్రి, చీకటి నిర్ణయాలు ఉండబోవు?

చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. మొన్నటివరకు పార్టీ టిక్కెట్ల విషయంలో ఆయన ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేవారు. అర్థరాత్రి బీ-ఫారాలు ఇచ్చేవారు. ఇకపై ఇలాంటి చీకటి నిర్ణయాలు ఉండవని తేల్చి చెప్పేశారు బాబు. …

చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. మొన్నటివరకు పార్టీ టిక్కెట్ల విషయంలో ఆయన ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేవారు. అర్థరాత్రి బీ-ఫారాలు ఇచ్చేవారు. ఇకపై ఇలాంటి చీకటి నిర్ణయాలు ఉండవని తేల్చి చెప్పేశారు బాబు. 

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారనే అంశంపై కనీసం 6 నెలల ముందే స్పష్టత ఇస్తానని ఆయన నేతలందరికీ హామీ ఇచ్చారు. 36 గంటల దీక్షతో పార్టీలో చైతన్యం తీసుకొచ్చిన చంద్రబాబు.. తిరుపతి, బద్వేల్ బై-ఎలక్షన్ల టైపులోనే సార్వత్రిక ఎన్నికలకు కూడా ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని చెప్పేశారు. కాకపోతే ఇక్కడ ఆయన క్లియర్ గా కొన్ని కండిషన్లు పెట్టారు.

ముందే చెప్పినా.. బాబుదే తుది నిర్ణయం..

అభ్యర్థులను ముందే నిర్ణయించినా, తుది నిర్ణయం మాత్రం బాబుదే ఉంటుంది. ఎక్కడా సమావేశాలు, సమీక్షలు ఉండవు. ఇన్ చార్జీలు, సీనియర్ నేతల అభిప్రాయాలతో సంబంధం లేకుండా.. అభ్యర్థుల పనితీరును నేరుగా చంద్రబాబే సమీక్షిస్తారట. ఆయన నిర్ణయమే ఫైనల్. అయితే ఆ నిర్ణయమేదో కాస్త తొందరగా తీసుకుంటారని సమాచారం.

స్క్రీనింగ్ కమిటీలకు చెల్లు చీటీ..

గతంలో టీడీపీలో టికెట్ ఖరారు కావాలంటే ముందుగా స్క్రీనింగ్ కమిటీ వారిని ఫైనల్ చేయాలి. ఆ తర్వాత ఆ లిస్ట్ ని బాబు నాన్చీ, నాన్చీ.. చివరకు నామినేషన్ ముందురోజు పేరు ప్రకటించేవారు. కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీలకు కూడా చోటు లేదంటున్నారు. 

ఎవరైతే ప్రజల్లో బాగా తిరుగుతున్నారో, వారికి మైలేజీ ఉందని చంద్రబాబు భావిస్తారో.. అలాంటి వారికే టికెట్లు కేటాయించబోతున్నారట. ఎన్నికలకు కనీసం ఏడాది ముందే టిక్కెట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు బాబు.

బయటికెళ్లే అవకాశం లేకుండా..

చంద్రబాబు తాజా నిర్ణయం వెనక ప్రధాన వ్యూహం ఒకటేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏడాది ముందు టికెట్లు కేటాయిస్తే.. అభ్యర్థులకు జనంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండటంతో పాటు, అసంతృప్తులకు కళ్లెం వేసినట్టు అవుతుందట. 

ఒకవేళ అసంతృప్తులు అలిగినా.. అలాంటి వారికి ఇతర పార్టీల్లో ముఖ్యంగా వైసీపీలో చోటు ఉండదు. అసమ్మతి రేగినా ఫిరాయింపులు ఉండవు. ఒకవేళ వెళ్లినా వాళ్లకు వైసీపీ తరఫున టిక్కెట్ రాదు. కాబట్టి టీడీపీలోనే కొనసాగుతారని, అసమ్మతి ఉండదని బాబు భావిస్తున్నారు.

పొత్తులతో చిత్తవుతారా..?

ఒకవేళ చంద్రబాబు ఏడాది ముందు అభ్యర్థులను ప్రకటించినా.. ఎన్నికల వేళ బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకోడానికే ఆయన ఉత్సాహం చూపిస్తారు. పొత్తులపై నిర్ణయం ఆలస్యం అయ్యే కొద్దీ అభ్యర్థుల్లో గుబులు రేగడం కామన్. 

ఒకవేళ ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. త్యాగరాజులు ఉంటే మాత్రం అది మరింత కష్టం. ఈ సమీకరణాలన్నీ బేరీజు వేసుకుని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే సమీకరణాలు మారినా, అభ్యర్థుల పేర్లు మారినా.. ఈసారి మాత్రం అర్థరాత్రి, చీకటి నిర్ణయాలు మాత్రం ఉండబోవు.