నాయకుడికి కావాల్సిన లక్షణాలు కొన్నుంటాయి-
1. ఉద్యమనేతైనా అయ్యుండాలి,
2. మాటలతో ఆకట్టుకునే నేర్పైనా ఉండాలి,
3. ప్రజల గుండెల్ని గెలుచుకునే పనితనమైనా ఉండుండాలి.
4. అవేవీ లేనప్పుడు కనీసం వ్యవస్థల్ని, పొత్తుల్ని, మీడియాని మేనేజ్ చేయగలిగే మేనేజర్ అయ్యుండి నాయకుడిగా భ్రమింపజేసే తెలివితేటలైనా ఉండాలి.
మొదటి దానికి ఉదాహరణ- కేసీయార్
రెండు- నరేంద్ర మోదీ
మూడు- జగన్ మోహన్ రెడ్డి
నాలుగు- చంద్రబాబునాయుడు
ఇందులో ఏ కోవకీ చెందకుండా, ఆ నాలుగింటిలో ఒక్క లక్షణం కూడా లేకుండా, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా, తన నియోజకవర్గం పేరు కూడా సరిగ్గా పలకలేనంత స్థితిలో ఉన్న ఔత్సాహిక యువకుడు నారా లోకేష్.
ఆది నుంచీ వైసీపీ నాయకులు, సానుభూతిపరులు లోకేష్ ని టార్గెట్ చేసి చంద్రబాబు మీద దుమ్మెత్తిపోయడమే జరుగుతోంది.
కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా ఎంతసేపూ వీక్ వికెట్టైన లోకేష్ మీదకే మాటల బౌలింగు చేస్తున్నారు. సీన్లో లోకేష్ లేకపోతే ఇంతటి అవమానకరమైన మానసిక దాడులకి చాన్సుండేది కాదేమో అనిపిస్తుంది చాలాసార్లు.
పరిస్థితి ఇలా ఉంటే “అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది” అన్నట్టు లోకేష్ గట్టిగా అరుస్తూ వైసీపీ వాళ్లకి వార్ణింగులివ్వడం అస్సలు ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వాల్యూం ఒక్కటే సరిపోదు..మాడ్యులేషన్, ఆర్టిక్యులేషన్, పదాల స్పష్టత చాలా అవసరం. వీటి విషయంలో అతనికి ట్రైనింగ్ ఇస్తున్నారని ప్రచారం అయ్యింది. కానీ ఫలితం కనబడడంలేదు.
చేపకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నేల మీద పరుగెత్తలేదు.
ఏనుక్కి ఎన్ని క్లాసులు తీసుకున్నా గాల్లో ఎగరలేదు.
అలాగే లోకేష్ ఎంత కష్టపడ్డా పని జరగదేమో అనిపిస్తోంది.
అయినా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు..కానీ సరిపోవట్లేదల్లే ఉంది.
ఏ శ్రమా చేయకుండా నిద్రపోతున్నా కూడా పేరిగేది గెడ్డం.
బుద్ధి పెరగాలంటే చాలా గంటలు నిద్రపోకుండా కష్టపడాలి.
ఏ శ్రమా చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోయేది శరీరం బరువు.
కానీ బుర్రలోని వెర్రితనం నోటిద్వారా బహిర్గతమవ్వడం తగ్గాలంటే ముందు మౌనం వహించడం నేర్చుకోవాలి.
“మౌనంసర్వార్థసాధనం” అని ఊరికే అనలేదు. మౌనం వల్ల పెదాలు మూసుకునుంటాయి. మెదడు పొరలు తెరుచుకుంటాయి. అప్పుడే ఆలోచనలు పుడతాయి. జనమంతా చేతకానివాడిగా చూస్తున్నప్పుడు నోరేసుకుని పడితే ప్రగల్భాల్లా ఉంటాయి తప్ప ఎవారూ సీరియస్ గా తీసుకోరు.
సినిమాల్లో బ్రహ్మానందం చెప్పే, “ఫైర్ ఫైర్స్ ద ఫైర్. అయాం ద ఫైర్..” అని కామెడీ కోసం చెప్పే సీరియస్ డయలాగుల్లా ఉంటాయంతే.
తాజాగా లోకేష్ ఒక మాటన్నాడు-
“జగన్ ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న క్యాడర్ కి తమ లీడర్ కనుసైగ చేస్తే చాలు. వైసీపీ కార్యాలయాల విధ్వంసం నిమిషం పని. ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ మా కార్యకర్తలు తరిమికొడతారు….”
ఇదీ పరిస్థితి.
కొన్ని డయలాగ్స్ చెప్పడానికి స్టేచరుండాలి.
బాలకృష్ణ సీమ సినిమాల్లోని డయలాగులకి ప్యారడీల్లా ఉన్న ఈ స్పీచుని లోకేష్ ఇస్తుంటే టీడీపీ క్యాడరే నవ్వుకుంటున్నారన్న సత్యం వీళ్లకి ఎవరు చెప్తారో? చెప్పకపోతే నిజమనుకునే భ్రమలో ఉండి లోకేష్ ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు.
చంద్రబాబుకి పుత్రప్రేమ నరనరాల్లోకి ఎక్కేసింది. అది దిగదు. కానీ పార్టీ భవితవ్యం కోసం, తండ్రి మానసిక ఆరోగ్యం కోసం, తెలుగు తమ్ముళ్లకోసం స్వచ్ఛందంగా లోకేష్ రాజకీయాల్లోంచి తప్పుకుంటే, చరిత్ర శాశ్వతంగా ఇతన్ని గుర్తుపెట్టుకుంటుంది.
తనకి తగని పనిని తాను చెయ్యలేనని ఒప్పేసుకున్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది.
చేతకాని పని చెయ్యలేక అభాసుపాలయ్యేకంటే తప్పుకుని మహరాజులా బతకొచ్చు.
కొడుకుకి నిజంగా ఆసక్తిలేని రంగమని తండ్రికి తెలిస్తే ఆయన కూడా బలవంతపెట్టడు.
పార్టీని, తండ్రిని వదలకుండా లోకేష్ కొనసాగుతున్నంతవరకూ తెలుగుతమ్ముళ్ల కోరికలు ఎప్పటికీ నెరవేరవు.
“లోకాసమస్తా సుఖినో భవంతు” అనేది లోకేష్ బాబు చేతిలో ఉందిప్పుడు.
హరిగోపాల్ సూరపనేని