2019 సాధారణ ఎన్నికలలో వైసీపీకి అనూహ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లోని ప్రజలు పట్టం కట్టారు. మూడు జిల్లాల ప్రజలూ టీడీపీని తోసిరాజన్నారు. నూటికి ఎనభై శాతం పైగా సీట్లు వైసీపీ పరం అయ్యాయి. అయితే నాడు టీడీపీకి దక్కిన అరడజన్ సీట్ల మీదనే ఇపుడు వైసీపీ పెద్దల కన్ను ఉంది.
శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఒడిషా బోర్డర్ లో ఉన్న ఇచ్చాపురం లో టీడీపీ గెలిచింది. ఇది తమకు కంచుకోట అని కూడా ఆ పార్టీ గర్విస్తూ ఉంటుంది. ఆ మాట వింటే తన రక్తం మరుగుతుందని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సీదరి అప్పలరాజు అంటున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చాపురానికి ఇచ్చినన్ని పదవులు జిల్లాల్లో మరే నియోజకవర్గానికి దక్కలేదని ఆయన క్యాడర్ కి చెప్తున్నారు, గురుతర బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇచ్చాపురం వైసీపీ ఖాతాలో పడాల్సిందే అన్నారు. ఇప్పటి నుంచే క్యాడర్ అంతా కష్టించి పని చేస్తే ఫ్యాన్ ఇచ్చాపురంలో గుర్రున ఎలా తిరగదో తాను చూస్తానని కూడా ఆయన సవాల్ చేశారు.
శ్రీకాకుళమే కాదు, ఉత్తరాంధ్రా జిల్లలలో వైసీపీ విజయ పరంపర ఇచ్చాపురం నుంచే స్టార్ట్ కావాలని కూడా మంత్రి అంటున్నారు. మొత్తానికి టీడీపీకి గట్టిగా స్ట్రోక్ ఇచ్చేందుకు ఇచ్చాపురాన్నే వైసీపీ ఎంచుకున్నట్లుగా ఉంది.