ఇంకా రెండున్నరేళ్లు టైమ్ ఉంది. అంతలోనే రాష్ట్రంలో ఎన్నికల వేడి మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువయ్యాయి.
మొన్నటికిమొన్న లోకేష్, ఆ తర్వాత అచ్చెన్నాయుడు, ఈమధ్య అయ్యన్నపాత్రుడు.. ఇలా జగన్ పై ఇష్టారీతిన మాట్లాడే వాళ్ల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పట్నుంచే ఈ వ్యవహారశైలికి అడ్డుకట్ట వేయాలని జగన్ నిర్ణయించారు. మంచి సమయం కోసం ఎదురుచూశారు. పట్టాభి రూపంలో ఆ సమయం రానే వచ్చింది.
ఇప్పుడు జగన్ తన పవర్ చూపిస్తున్నారు. పట్టాభిని ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలులో కూర్చోబెట్టారు. చంద్రబాబు తన వ్యవస్థలతో మేనేజ్ చేసి పట్టాభిని బయటకు తీసుకొస్తారనేది బహిరంగ రహస్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు.
కాకపోతే తనపై నోరు పారేసుకోవాలనే నేతలకు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకుంటున్నారు జగన్. దాని కోసం పట్టాభిని పూర్తిస్థాయిలో వాడుకోవాలని నిర్ణయించారు.
ఇకపై తనపై విమర్శలు చేసేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి తీసుకురావాలనేది జగన్ ఆలోచన. అలాంటి వాళ్లలో భయం పుట్టించేందుకు పట్టాభిని ఫుల్ గా వాడుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు.
రాబోయే ఎన్నికల వేడిని తట్టుకోవాలన్నా, మరింతమంది తనపై విరుచుకుపడకుండా అడ్డుపుల్ల వేయాలన్నా, పట్టాభిని బూచిని చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ ను హైలెట్ చేయాల్సిందే. జగన్ ఇప్పుడు అదే పని చేస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కొంతమందిని అదే పనిగా ఎగదోయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రఘురామ లాంటి అధికార పార్టీ నేతల్ని ఇప్పటికే పొల్యూట్ చేసిన చంద్రబాబు, రాబోయే రోజుల్లో మరింతమంది వైసీపీ నేతల్ని తనవైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. దీనికితోడు సైకిల్ ఎక్కాలనుకునే మరికొంతమంది ఇతర పార్టీ నేతల్ని కూడా చంద్రబాబు, జగన్ పైకి ఉసిగొల్పే అవకాశం కూడా ఉంది.
ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే పట్టాభి ఎపిసోడ్ తో ప్రతిపక్షాల్లో భయం పుట్టించాలి. జగన్ పై నోరు పారేసుకుంటే తమకు కూడా అదే గతి పడుతుందనే భయం అందర్లో కలగాలి. ఆ దిశగానే జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
గతంలో జగన్ ని తిడితే ఎవరో ఇద్దరో ముగ్గురో వైసీపీ ముఖ్యులు స్పందించి వదిలిపెట్టేవారు. ఇప్పుడు జనాగ్రహ దీక్షలంటూ రాష్ట్రవ్యాప్తంగా బొమ్మ దద్దరిల్లిపోయింది. జగన్ ని తిడితే జనం తరిమి తరిమి కొడతారనే భావన కూడా ప్రతిపక్షాల్లోకి వెళ్లిపోయింది. మరోవైపు పట్టాభి ఎపిసోడ్ తో పవన్ కల్యాణ్ నోటికి కూడా పూర్తి స్థాయిలో తాళం పడింది. నోరు పారేసుకుంటే పట్టాభే కాదు, పవన్ కూడా జైలుకే అనే సిగ్నల్స్ వచ్చాయి.
కాబట్టి చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షతోనో, వైసీపీ నేతలు చేసిన జనాగ్రహ దీక్షతోనో పట్టాభి ఎపిసోడ్ ముగిసిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆట ఆరంభమైంది.