తాడేపల్లి ఇంటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటికి రావాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటకే రావడం లేదని ఆరోపించారు. దీంతో ఆయనకు సమస్యలేంటో తెలియడం లేదన్నారు.
అధికార పార్టీ నేతలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో బద్వేలులో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. వైసీపీ నేతలు సామాన్యుల స్థలాలనూ విడిచిపెట్టడం లేదని ఆరోపించారు.
కబ్జాకు గురైన బాధితులు నిన్న ఆత్మహత్యాయత్నం చేశారని వాపోయారు. పల్లెల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని సోము వీర్రాజు మండిపడ్డారు.
ఇదిలా వుండగా బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర సమాచార సహాయ మంత్రి మురుగన్, సోము వీర్రాజుతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేకున్నా… ఆ పార్టీ నేతలు పరువు నిలుపుకోవాలని తాపత్రయ పడుతున్నారు.
డిపాజిట్ దక్కించుకోవాలని బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వైసీపీ, టీడీపీ నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.