అదేదో సినిమాలో ‘నీ ఫేస్ నాకు నచ్చలేదు’ అంటాడో కమెడియన్. పవన్ కళ్యాణ్ – వైఎస్ జగన్ ఉదంతం చూస్తే అచ్చం అలాగే వుంటుంది. అనిపిస్తుంది. పొలిటికల్ కాదు అసలు పర్సనల్ గానే జగన్ అంటే పవన్ కు సరిపడదేమో అని అనిపిస్తుంది. చంద్రబాబు అంటే ఎన్నాళ్ల నుంచో రాజకీయాల్లో వున్నారు. తన అధికారం జగన్ లాక్కుంటాడనో, లాక్కున్నాడనో వ్యతిరేకత పెంచుకుని వుండొచ్చు. కానీ పవన్ తనంతట తాను జగన్ పట్ల వ్యతిరేకత పెంచుకోవడానికి అసలు రీజన్ ఏమిటి?
అసలు..ముందు నుంచి వెనక్కు వెళ్దాం. 2022..ఇప్పుడు పవన్ బలంగా జగన్ ను ద్వేషిస్తున్నారు. మూడేళ్లు పవర్ లో వున్న జగన్ ను మరోసారి పవర్ లోకి రానివ్వను అని పట్టుదలగా చెబుతున్నారు. శపథాలు చేస్తున్నారు.
కారణం ఏమై వుంటుంది?
జగన్ పాలన పవన్ కు నచ్చలేదు. అంతకు మించిన రీజన్ ఏముంటుంది అని అనుకుందాం. పవన్ దృష్టిలో అది సరైన రీజన్. సో తప్పు పట్టడానికి లేదు.
కానీ కొంచెం వెనక్కు వెళ్తే..2019. అప్పుడూ పవన్ ఇదే పాట. జగన్ ను అధికారంలోకి రానివ్వనూ అంటూ. సరే, అప్పటికే అయిదేళ్ల పాటు జగన్ ప్రతి పక్షంలో వున్నారు. అధికార పక్ష నాయకుడిగా చంద్రబాబు ఫేస్ నచ్చింది..పని తీరు నచ్చింది. కానీ ప్రతిపక్ష నేతగా జగన్ పనితీరు నచ్చలేదు. అందుకే అలా డిసైడ్ అయిపోయారు అనేసుకుందాం మళ్లీ. మరి కాస్త వెనక్కు వెళ్దాం.
2014 కు జగన్ పార్టీ తొలిసారి పోటీ చేసిన కాలం. పవన్ కూడా అప్పుడే వచ్చారు. చంద్రబాబు ఎప్పటి నుంచో వున్నారు. జగన్ పని తీరు అసెస్ చేసే అవకాశం పవన్ కు లేదు. అయినా కూడా పవన్ కు జగన్ ఫేస్ నచ్చలేదు. జగన్ నచ్చలేదు. బాబు వెనుక చేరారు. అది ఆయన ఇష్టం అనుకుందాం.
కానీ ఒకటే ప్రశ్న
2014..2019..2022 జగన్ ఎందుకు నచ్చడం లేదు పవన్ కు..ఎందుకు జగన్ ను అంతగా ద్వేషిస్తున్నారు. ఎందుకు జగన్ ను అధికారంలోకి రానివ్వకూడాదని ముచ్చటగా మూడుసార్లు ప్రయత్నం?
అన్ స్టాపబుల్ లో ఈ ప్రశ్న అడుగుతారా?
ఎందుకంటే పవన్ నేరుగా ఇంటర్వూలు ఇవ్వరు. పొరపాటున ఇంటర్వూలు చేయించుకున్నా..అక్కడ కూడా రిపోర్టర్ ఫేస్ కనపడనివ్వకుండా వాయిస్ ఓవర్ అన్నట్లు వుంటుంది వ్యవహారం. అందువల్ల అన్ స్టాపబుల్ ఒక్కటే చాన్స్ ఇలాంటి ప్రశ్న అడగడానికి.