మళ్లీ మాస్కుల గోల మొదలైంది. కరోనా కేసుల కౌంట్ ప్రారంభమైంది. ఏ రోజుకారోజు ప్రభుత్వాల ప్రకటనలు ప్రత్యక్షమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో లాక్ డౌన్ మరోసారి ఉండదని, మరణాలు పెద్దగా సంభవించకోవచ్చనే అంశాలు కాస్త ఊరట కలిగిస్తున్నప్పటికీ.. థియేటర్ల వ్యవస్థపై మాత్రం మరోసారి అనుమానాలు పెరుగుతున్నాయి.
కేసుల సంఖ్య పెరిగితే ఆటోమేటిగ్గా ఆ ప్రభావం థియేటర్లపై పడుతుంది. ప్రభుత్వాలు చెప్పిన తర్వాత థియేటర్లు మూసేస్తారనే రోజులు పోయాయి. కేసులు పెరిగితే ఆటోమేటిగ్గా జనాలే రావడం తగ్గించేస్తున్నారు. ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోతోంది.
సంక్రాంతి సినిమాలు బిక్కు బిక్కు..
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా కేసులు పెరిగే క్రమం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా మొదలైతే కేసులు ఎలా పెరుగుతాయో ప్రజలకు కూడా ఓ ఐడియా వచ్చేసింది. క్రిస్మస్ అయిపోయింది. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్నాయి. వీటితో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిస్తే కేసుల సంఖ్య పెరగడం ఖాయం. కేసులు పెరిగితే ఆ ప్రభావం సంక్రాంతి సినిమాలపై పడడం ఖాయం.
ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలపై భారీగా బెట్టింగ్ నడుస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా సాగింది. ఇలాంటి టైమ్ లో కేసులు పెరిగి ఆక్యుపెన్సీ తగ్గితే, నిర్మాతలతో పాటు.. బయ్యర్లంతా లబోదిబోమనాల్సిందే.
మరోవైపు దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా కూడా సంక్రాంతికే వస్తోంది. ప్రేక్షకులు దీన్ని డబ్బింగ్ సినిమాగా చూస్తున్నప్పటికీ దిల్ రాజు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన సెంటర్లను వారసుడు కోసం అట్టిపెట్టుక్కూర్చున్నాడు. కరోనా మరోసారి విజృంభిస్తే దిల్ రాజు ప్లాన్స్ అన్నీ తారుమారవుతాయి.
ఈసారి థియేటర్ల పరిస్థితి ఏంటో!
కరోనా తగ్గిన తర్వాత ఏపీ, నైజాంలోనే థియేట్రికల్ సిస్టమ్ త్వరగా కోలుకుంది. ఉత్తరాదిన ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఇప్పుడు మరోసారి కేసులు పెరిగితే, గాడిన పడిన వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమౌతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగిల్ స్క్రీన్లు.. ఫంక్షన్ హాళ్లుగా, గోడౌన్లుగా మారిపోయాయి. ఇప్పుడు మరోసారి కేసులు విరుచుకుపడితే ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది.