హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎట్టకేలకు నిజం చెప్పాల్సి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి రాజేందర్ హైదరాబాద్‌లోని ఓ హోటల్ కలిశారని, వాళ్ల కలయిక వెనక మతలబు ఏంటని తెలంగాణ మంత్రి కేటీఆర్ గట్టిగా నిలదీశారు.
రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని, అందుకే కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థిని నిలిపారనే కేటీఆర్ వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో… ఈటల రాజేందర్ స్పందించక తప్పలేదు.
రేవంత్‌రెడ్డిని తాను కలిసింది నిజమేనని ఈటల అంగీకరించారు. అయితే తాను ఇప్పుడు కలిశాననడంలో వాస్తవం లేదన్నారు. మంత్రి పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే రేవంత్‌రెడ్డిని కలిసినట్టు ఈటల చెప్పారు.
అప్పట్లో అన్ని పార్టీల నాయకులను తాను కలిసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి విషయమై చర్చించేందుకు అన్ని పార్టీల నాయకులను కలవడం సహజమే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల సహకారం తీసుకోలేదా? అని ఈటల ప్రశ్నించడం గమనార్హం.
ఇదే విషయమై బీజేపీ నేత జితేంద్రరెడ్డి స్పందిస్తూ… రేవంత్‌రెడ్డి, ఈటల కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏదైనా పని నిమిత్తం వాళ్లిద్దరు కలిసి ఉండొచ్చన్నారు. దాన్ని రాజకీయం చేయడం ఏంటని జితేంద్రరెడ్డి ప్రశ్నించారు.