ఒకవేళ చంద్రబాబు ఘోషను వినడానికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కాస్త టైమ్ కేటాయిస్తే ఫర్వాలేదు. ఏపీ నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత వచ్చాడు కాబట్టి, వ్యక్తిగతంగా ఆయన ఎవరైనా.. హోదాను బట్టి అపాయింట్ మెంట్ కేటాయిస్తే ఫర్వాలేదు. ఒకవేళ అది కూడా లభించకపోతే, పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ డ్రామాకు క్లైమాక్స్ గా నిలవబోతోంది.
అమిత్ షా అపాయింట్మెంట్ అంటూ దక్కితే ఆ తర్వత తెలుగుదేశం దాని చుట్టూ ఎన్ని కథలైనా అల్లుతుంది.
చంద్రబాబు చేసిన ఫిర్యాదులను అమిత్ షా చాలా ఓపికగా విన్నారని, ఏపీలో ఏం జరుగుతోందో అడిగి తెలుసుకున్నారని, తాము కూడా ఏపీ పరిణామాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారని, చంద్రబాబు ఇక్కడి పరిస్థితులను వివరించడంతో.. అమిత్ షా సీరియస్ అయ్యారని.. చర్యలు తీసుకుంటామన్నారని, చంద్రబాబు ఫిర్యాదులపై పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామన్నారని.. పనిలో పనిగా పాత దోస్తీని కొనసాగించాలనే ప్రతిపాదన పట్ల కూడా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టుగా… వగైరా.. వగైరా.. ఇలా పచ్చ పార్టీ, పచ్చ మీడియా కలిసి ఎన్ని కథలైనా అల్లుతాయి!
అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కడం మీదే ఈ పొలిటికల్ డ్రామాను తాము అనుకున్న క్లైమాక్స్ తో ముగించడానికి టీడీపీకి అవకాశం ఉంటుంది. అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కితే.. ఏపీ బీజేపీలో తమను తక్కువ చేస్తున్న నేతలకూ అదే కౌంటర్ గా టీడీపీ అనుకోవచ్చు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వరకూ.. అన్ని ఊహాగానాలకూ, అన్ని ప్రచారాలకూ ఆ అపాయింట్ మెంట్ నే ఆధారంగా చూపించుకుని, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఇప్పుడు కనీసం అపాయింట్ మెంట్ దక్కకపోతే మాత్రం.. అంతే సంగతులు! చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో మొదలుపెట్టిన ఈ పొలిటికల్ డ్రామా అభాసుపాలవుతుంది. చంద్రబాబు ఏడ్చిమొత్తుకున్నా.. ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అంశంపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబును బీజేపీ అధినాయకత్వం మరోసారి నమ్మడానికి కాదు కదా, కనీసం తమ ఛాయలకు కూడా రానివ్వడం లేదనే స్పష్టతా వస్తుంది.
ఢిల్లీ వెళ్లడానికి కావాల్సిన సరంజామాను అయితే చంద్రబాబు రెడీ చేసుకున్నారు. ఈ డ్రామాకు క్లైమాక్స్ ను అక్కడ ఇవ్వాలని లెక్కలేసినట్టుగా ఉన్నారు. మరి అక్కడ క్లైమాక్స్ అవుతుందో, యాంటీ క్లైమాక్స్ అవుతుందో!