తుని టికెట్ విషయమై మాజీ మంత్రి యనమల బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. తన పెద్ద కుమార్తె దివ్యకు తుని టీడీపీ టికెట్ ఇవ్వనున్నట్టు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. దీంతో తమ్ముడు యనమల కృష్ణుడు తన అన్నపై ఫైర్ అవుతున్నారు. తుని నియోజకవర్గంలో తాను లేకపోతే టీడీపీని కాపాడేవారే లేరని, కష్టనష్టాలను భరిస్తూ పార్టీని బతికించుకున్నట్టు కృష్ణుడు వాదిస్తున్నారు.
ఒకప్పుడు తుని నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 2004 వరకూ వరుసగా ఆరుసార్లు యనమల రామకృష్ణుడు తుని నుంచి గెలుపొందారు. 2009 నుంచి యనమలకు ఓటమి స్వాగతం పలికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అక్కడ టీడీపీ గెలవనే లేదు. 2009లో తుని నుంచి యనమల ఓడిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. 2019లోనూ అదే ఫలితం రిపీట్ అయ్యింది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. యనమల రామకృష్ణుడు తన పెద్ద కూతురు దివ్యను తుని నుంచి బరిలో నిలపాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన పెద్ద కుమార్తెకు టికెట్ అని యనమల తుని టీడీపీ శ్రేణులకి సంకేతాలు ఇచ్చారు. తనను కాదని కూతురికి టికెట్ ఇవ్వనున్నట్టు యనమల చేస్తున్న ప్రచారంపై తమ్ముడు కృష్ణుడు రగిలిపోతున్నారు. ఇదే విషయమై టీడీపీ కార్యకర్తతో కృష్ణుడు ఫోన్ సంభాషణ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు 30 వేల ఓట్లు యాదవుల ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. కృష్ణుడికి కాకుండా దివ్యకు టికెట్ ఇస్తున్నారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న విషయాన్ని యనమల దృష్టికి తీసుకెళ్తానని కార్యకర్త చెప్పడం గమనార్హం. 13 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కృష్ణుడిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఇంట్లో మహిళలు తిడ్తారని యనమలకు చెబుతానని కృష్ణుడితో కార్యకర్త చెప్పడం గమనార్హం.