ఇట్టే కామెడీలు చేశావు, పిట్ట కథలు చెప్పావు.. సెటైర్లు వేశావు, నోటికొచ్చినట్టుగా మాట్లాడి.. పచ్చ చొక్కాలను కాసేపు నవ్వించావు! కట్ చేస్తే పచ్చ పార్టీ పరిస్థితి 23 సీట్లకు జారింది. మరి ఈ 23 సీట్ల వేళ అయినా కాస్తైనా జాగ్రత్తగా ఉంటున్నారా అంటే.. అలాంటిదేమీ లేదన్నట్టుగా మళ్లీ పిట్టకథల పొట్టి నర్సిరెడ్డే తెర మీదకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ వీరభక్తుడు అయిన తెలంగాణ బిడ్డ పొట్టి నర్సిరెడ్డి చంద్రబాబు దీక్షతో మళ్లీ తెరపైకి వచ్చాడు.
ఆల్రెడీ లోకేష్ కామెడీ చాలదన్నట్టుగా పొట్టి నర్సిరెడ్డి చేత కూడా కామెడీ చేయించారు. బహుశా లోకేష్ కామెడీ ప్రత్యర్థుల కోసం, నర్సిరెడ్డి కామెడీ తెలుగుదేశం వారి కోసం కావొచ్చు. ఈ విదూషక పాత్రలు మాత్రం తెలుగుదేశం మీటింగుల్లో కచ్చితంగా ఉంటాయి.
గతంలో వేణుమాధవ్ చేత ఇలాంటి వేషాలే వేయించేవారు. ఆ తర్వాత పొట్టి నర్సిరెడ్డి కి పేమెంట్స్ అందుతున్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి నర్సిరెడ్డి పిట్ట కథలు పచ్చ పార్టీకి పసందుగా అనిపిస్తున్నాయి.
అయితే.. ఈ తీరంతా గమనిస్తే గతం గుర్తుకు వస్తుంది. అధికారంలో ఉన్న వేళ నర్సిరెడ్డి వంటి వాళ్ల చేత మహానాడు అంటూ కామెడీలు చేయించే వారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పనికిమాలిన పంచులన్నీ వేయించే వాళ్లు.
ఆ పంచులకు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈలలు కొడుతూ, కడుపుబ్బా నవ్వుకునే వారు. ఆ నవ్వులు అప్పటికి బాగానే ఉండేవి కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ శ్రేణులు ఏడ్చి మొత్తుకున్నాయి. నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా అంటూ చంద్రబాబు చుట్టూ ఏడ్పులూ పెడబొబ్బలు సాగాయి.
ఇప్పుడు మళ్లీ నర్సిరెడ్డి హంగామా చేస్తూ.. గతంలో చెప్పిన పిట్టకథలతో టీడీపీని 23 స్థాయికి వచ్చింది, ఇప్పుడు సున్నా రేంజ్ కు తీసుకెళ్లేందుకు వీళ్లంతా అలుపులేకుండా శ్రమిస్తున్నట్టుగా ఉన్నారనిపిస్తోంది!