తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా కార్మికులకు మద్దతు తెలిపాయి. దీనికితోడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ముందుండటంతో కాంగ్రెస్, బీజేపీ, ఆఖరికి టీడీపీ కూడా కార్మికుల పక్షాన గట్టిగానే నిలబడి పోరాటాలు చేశాయి. సీపీఐ, సీపీఐం, కోదండరాం కూడా టీఎస్ఆర్టీసీ సమ్మె విషయంలో పూర్తి మద్దతునిచ్చారు, అరెస్ట్ లకు కూడా వెనకాడలేదు. అయితే ఇప్పుడు హుజూర్ నగర్ ముచ్చట ముగిసింది. మరి ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
సమ్మెలో చప్పుడు చేస్తే హుజూర్ నగర్ లో పిసరంతైనా లాభం ఉంటుందేమోనని బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా కార్మికులకు మద్దతివ్వడంలో పోటీపడ్డాయి. రేవంత్ రెడ్డి ఉరుకులు, పరుగులు, బీజేపీ లక్ష్మణ్ కి అయిన గాయాలు.. అన్నిటినీ శంకించలేం కానీ.. ఎవరు రోడ్డెక్కినా మనసులో హుజూర్ నగర్ ఫలితం గురించే ఆలోచించేవారు. అధికార టీఆర్ఎస్ ని సమ్మెతో ఇరుకున పెట్టాలని భావించారు. కానీ ప్రతిపక్షాల పాచిక పారలేదు, స్థానిక రాజకీయ కారణాల వల్ల ఆర్టీసీ వ్యవహారం హుజూర్ నగర్ ఫలితంపై ప్రభావం చూపలేకపోయింది.
దీంతో ఒక్కసారిగా అటు కార్మికుల్లో ఇటు ప్రతిపక్షాల్లో నైరాశ్యం నెలకొంది. ఆర్టీసీ కార్మికులది తమ జీవన పోరాటం కాబట్టి, వారు వెనక్కి తగ్గలేరు. ప్రతిపక్షాల విషయమే ఇప్పుడు తేలాల్సిఉంది. ఇన్నిరోజులూ హుజూర్ నగర్ ఎన్నికలో లాభం కోసం సై అంటే సై అంటూ కార్మికుల ముందు నిలబడ్డ ఈ రాజకీయ నేతలంతా ఇప్పుడు కూడా వారికి సహకరిస్తారా? ఇంతకు ముందులాగే జోరుగా ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొంటారా? ఈ విషయమే ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఒకవేళ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గితే, ఆర్టీసీ కార్మికుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. కార్మిక నాయకుడు అశ్వత్థామరెడ్డి కేసీఆర్ మాటలకు భయపడేది లేదంటూ ధైర్యంగానే ఉన్నా.. జీతాలు లేక ఇప్పటికే సగం మంది కార్మికులు నీరసించిపోయారు. కోర్టు సూచనల్నే కేసీఆర్ ధిక్కరించే స్థితికి వచ్చేశారు, ఇటు హుజూర్ నగర్ గెలుపు కూడా ప్రజా నిర్ణయం ఏంటో తెలియజేసింది కాబట్టి కొంతమంది కార్మికులు వెనకడుగేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇలాంటి దశలో ప్రతిపక్షాల నైతిక మద్దతే కార్మికులకు కావాల్సి ఉంది. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటే మాత్రం కార్మికులు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. ప్రతిపక్షాల నిబద్ధతకు సిసలైన పరీక్షాకాలం ఇది.