జగన్ ను శంకిస్తున్న కేసీఆర్?

అనుకున్నట్టే అయింది, తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రస్తావన తెచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ప్రధానంగా టీఎస్ఆర్టీసీ నాయకుల్లో కదలిక వచ్చింది.…

అనుకున్నట్టే అయింది, తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రస్తావన తెచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ప్రధానంగా టీఎస్ఆర్టీసీ నాయకుల్లో కదలిక వచ్చింది. తెలంగాణలో జరిగే సమ్మెకి పరోక్ష కారణం జగనే అనడంలో సందేహం లేదు. అయితే అక్కడ సమ్మె మొదలైనప్పటినుంచి జగన్ సంయమనంతో ఉన్నారు. దసరా వేళ ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచి కాస్తో కూస్తో ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి మేలు చేశారు కానీ ఇబ్బంది పెట్టాలని చూడలేదు. కేసీఆర్ మాత్రం జగన్ విషయంలో మరోలా స్పందించారు.

ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందా అని సందేహం వ్యక్తంచేశారు కేసీఆర్. మాట ఇస్తే మడమతిప్పే రకం కాదు జగన్. తిరుగులేని మెజార్టీ వచ్చినా ఎక్కడా విజయగర్వం తలకెక్కించుకోలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నిటినీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాలుగు నెలల్లోనే పట్టాలెక్కించిన ఘనుడు. అలాంటి జగన్ ఆర్టీసీ ఉద్యోగులను నమ్మించి మోసం చేస్తారా? కేసీఆర్ మాత్రం ఇలాంటి సందేహమే వెలిబుచ్చారు. ప్రజల్లో లేనిపోని అనుమానాల్ని రేకెత్తించారు.

“ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని అంటున్నారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమే, దానిపై కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి. అది ఎప్పుడొస్తుందో, ఆ నివేదికలో ఏముంటుందో ఎవ్వరికీ తెలియదు”.. అంటూ సెలవిచ్చారు తెలంగాణ సీఎం. ఏపీలో ప్రతిపక్షం కూడా ఇలాంటి మాటలు మాట్లాడే సాహసం చేయలేదు. కానీ కేసీఆర్ మాత్రం తన పబ్బం గడుపుకోడానికి జగన్ నిర్ణయంపైనే అనుమానాలు వ్యక్తంచేశారు.

ఆరు నూరైనా.. ఇచ్చిన మాటకు కట్టుబడే రకం జగన్. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ సాధ్యం కాదన్నదీ ఇదే జగన్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నదీ ఇదే జగన్. సాధ్యంకాని పనుల్ని చేస్తానని ప్రజల్ని ఏమార్చేరకం కాదు జగన్, సాధ్యమయ్యేవాటి విషయంలో ఎవరు అడ్డుపుల్ల వేసినా ఊరుకునే రకం కూడా కాదు. ఈ విషయం కేసీఆర్ కి తెలియదేమో కానీ, ఏపీ ప్రజలందరికీ ఈ నాలుగున్నర నెలలో అనుభవం అయిన విషయమే.

తెలంగాణ ఆర్టీసీ విషయంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనేది నూటికి నూరుపాళ్లూ నిజం. హుజూర్ నగర్ గెలుపుతో ఈ నియంతృత్వ పోకడ మరింత పెట్రేగిపోతుందనేది కూడా వాస్తవమే. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా, చేయరా.. టీఎస్ఆర్టీసీని, టీఆర్ఎస్ ఆర్టీసీగా మారుస్తారా లేదా అనేది పూర్తిగా తెలంగాణకు చెందిన అంశం. అలాగే పూర్తిగా ఏపీకి సంబంధించిన ఆర్టీసీ విలీనాన్ని కేసీఆర్ శంకించడం ఏమాత్రం భావ్యం కాదు.