ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత.. అక్కడ ఏం జరిగిందనేది ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా విన్నవించినట్లు, అలాగే గోదావరి జలాలను కృష్ణతో అనుసంధానించే ప్రాజెక్టు కేంద్రమే చేపట్టాలని కోరినట్లు.. వార్తలు వచ్చాయి.
అయితే అసలు రాష్ట్ర వ్యవహారాల గురించి అమిత్ షాతో చర్చలే జరగలేదని ఆ పార్టీ నాయకుడు సుజనా చౌదరి అంటున్నారు? ఆ సంగతి ఆయనకు ఎలా తెలుసు? అమిత్ షా ఆయనతో చెప్పారా? ఆయనేమైనా అమిత్ షాకు మేనేజరా? లేదా, ఆయన కార్యాలయం బయట నిల్చుని.. లోపలి భేటీల ఖచ్చిత వివరాలు చెప్పగల బిళ్ల బంట్రోతా? అని ప్రజలు సందేహిస్తున్నారు.
భారతీయజనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగాలని అనుకుంటోంది. తెలుగుదేశాన్ని అధిగమించి.. సెకండ్ పొజిషన్ లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. కలగంటోంది. అందుకు తగినట్లుగా ఎక్కడా గతిలేకుండా పోయిన ఇతర పార్టీల నాయకులందరినీ తమలో కలిపేసుకుంటోంది. అదే బలం.. అనుకుంటోంది. అయితే.. రాష్ట్ర పురోగతికి మాత్రం ఇసుమంతైనా కేంద్రం తరఫునుంచి స్పందన రాబట్టకుండా.. విలన్ పాత్ర పోషిస్తోంది.
సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిశారు. ఏదో తమ తరఫు విన్నపాలను వారి చెవిన వేశారు. రాష్ట్ర కమల నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. ఆ డిమాండ్లకు కేంద్రం నుంచి అనుమతులు, మంజూరులు వచ్చేలా కృషిచేయాలి. కావలిస్తే.. జగన్ లేఖ ఇచ్చినంత మాత్రాన పని జరిగిపోలేదని, తాము ప్రయత్నిస్తేనే వచ్చిందని ప్రజల ఎదుట గొప్పలు చెప్పుకోవచ్చు. అంతిమంగా.. రాష్ట్రానికి మేలు జరగడం ముఖ్యం.
కానీ భాజపా నాయకులు అలాంటి కృషి చేయడంలేదు. ముఖ్యమంత్రిగా జగన్ ఏదో తన ప్రయత్నాలు తాను చేస్తోంటే.. అసలు అమిత్ షా రాష్ట్ర విషయాలు మాట్లాడనే లేదంటూ అపశకునాలు పలుకుతున్నారు. జగన్ ను తిట్టిపోసినంత మాత్రాన… జగన్ కు కేంద్రం వద్ద విలువలేదని రాష్ట్ర ప్రజలు ఎదుట డప్పుకొట్టినంత మాత్రాన.. తాను హీరో అయిపోతానని సుజనాచౌదరి భావిస్తే గనుక.. అది పొరబాటు.
సుజనా మాటలను ప్రజలు నమ్మితే గనుక.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి… రెండు రోజులు నిరీక్షించి తనతో భేటీ అయితే.. శుభాకాంక్షలు పుచ్చుకోవడం మినహా.. రాష్ట్ర వ్యవహారాలు మాట్లాడలేదని వారు కూడా భావిస్తే గనుక.. భారతీయ జనతా పార్టీకే నష్టం జరుగుతుందని సుజనా తెలుసుకోవాలి.