హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలు అనూహ్యమైనవి ఎంతమాత్రమూ కాదు. గత ఎన్నికల్లోనే యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని.. ధీమా వ్యక్తం చే సిన ఉత్తమ్ కు మెజారిటీ పదివేలకు పడిపోయింది. ఇప్పుడు తెదేపా, భాజపా అందరూ విడివిడిగా పోటీచేయగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలింది. పైగా కేండిడేట్.. ఉత్తమ్ భార్య. అతిథి నాయకురాలు. ఇవన్నీ సైదిరెడ్డికి కలిసి వచ్చాయి. మొత్తానికి గెలుపు నమోదైంది. కానీ.. ఆ గెలుపు అందించిన మత్తులో గులాబీ అధినేత కేసీఆర్ చెలరేగి మాట్లాడడం చిత్రంగా కనిపిస్తోంది.
గరువారం విజయం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన వాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గెలిపించారు గనుక.. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ఓ మాట అన్నారు. అంతే తప్ప.. ప్రజాఉద్యమాలను గానీ, ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థను గానీ, ప్రతిపక్షాలను గానీ ఏమాత్రం ఖాతరు లేకుండా మాట్లాడారు. హుజూర్ నగర్ లో గెలిస్తే.. ఆర్టీసీ సమ్మె విషయంలో ఇక కేసీఆర్ ఏమాత్రం తగ్గేది ఉండదని అందరూ అనుకున్నదే. కానీ కేసీఆర్ మరింత ఎక్కువగా ప్రవర్తించారు. ‘‘ముగిసేది సమ్మె కాదు.. ఆర్టీసీనే!’’ అంటూ హూంకరించారు. ‘‘జీతాలు ఇవ్వమంటే.. నాలుగు బస్ స్టేషన్లు అమ్మి ఇవ్వాల్సిందే’’ అంటూ వెటకారం చేశారు. ‘‘కార్మికులు మళ్లీ ఉద్యోగం కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే’’ అంటూ ఛీత్కరించారు.
హైకోర్టు తీర్పును చాలా మెలకువతో తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్. కోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందే తప్ప.. ఆదేశాలు కాదనే పాయింటు పట్టుకుని.. అసలు ఆర్టీసీ యూనియన్లతో చర్చలకు కూడా ఆయన ఇచ్చగించలేదు. ఇవాళ విజయం అందించిన ఉత్సాహంలో జీతాల కోసం కోర్టుకు వెళ్లిన అంశం ప్రస్తావిస్తూ.. ‘‘ఏం చేస్తది హైకోర్టు.. కొడతదా’’ అనే మాట తూలారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థకు- న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవం ఏపాటిదో తెలుస్తోంది. ‘‘హైకోర్టుకు తీర్పు చెప్పే పవర్ లేదు’’ అంటూ ప్రెస్ మీట్లో సెలవిచ్చిన కేసీఆర్, అదే మాటను తమ ప్రభుత్వ న్యాయవాదితో హైకోర్టులోనే ఎందుకు చెప్పించలేకపోతున్నారు. అక్కడ ఆ మాట అంటే ఏమవుతదో సారుకు తెలుసు. ప్రెస్ మీట్లో అయితే.. చెప్పింది వినేవాళ్లే తప్ప.. అడిగేవాళ్లు ఉండరనే ధీమా.
ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపు మాత్రమే అనే ధోరణి సమాజానికి ఒక హెచ్చరిక. త్వరలోనే ఆరేడువేల బస్సులకు పర్మిట్లు ఇస్తాం అనడం బెదిరింపు. ఇదంతా గెలుపు మత్తులో కేసీఆర్ మాట్లాడుతున్న తీరు. కానీ కేసార్ ఇంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో ఒక విలువైన మాట అన్నారు.
ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘బాధ్యతగా ప్రవర్తిస్తే.. రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు…’’ అని సెలవిచ్చారు. కానీ ఆయన మరో సంగతి గుర్తుంచుకోవాలి. కేసీఆర్ సారథ్యంలోని గులాబీదళం ‘బాధ్యత మరచి ప్రవర్తించినా కూడా వారు (ప్రతిపక్షాల వారు) అధికారంలోకి వస్తారు’… ఆ స్పృహ దళపతికి ఉంటే చాలు!!