ఆమెకు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం అడ్డొస్తుందా ?

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదుగానీ దాని మీద చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. మంత్రివర్గం నుంచి ఎవరు బయటకు పోతారు? ఎవరు ఉంటారు ? అనే దానిపై ఎవరి ఊహాగానాలు వారు…

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదుగానీ దాని మీద చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. మంత్రివర్గం నుంచి ఎవరు బయటకు పోతారు? ఎవరు ఉంటారు ? అనే దానిపై ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. 

ఆమె పేరు ఆర్కే రోజా. నగరి ఎమ్మెల్యే. వేరేవారికి మంత్రి పదవులు వస్తేనేం, రాకపోతేనేం. రోజాకు వస్తుందా రాదా అన్నదే చర్చనీయాంశమైంది. పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్ కావడం, రెండుసార్లు ఎమ్మెల్యే కావడం, సినిమా రంగంలో మాజీ హీరోయిన్ కావడం, టీవీ రంగంలో సెలబ్రిటీ కావడం, సీఎం జగన్ అభిమాన నాయకురాలు కావడం ఇలాంటివన్నీ కారణాలు.

అందుకే ఆమెకు మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా అన్న దానిపై అంత ఆసక్తి. జగన్ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఆమెకు హోమ్ మంత్రి ఇస్తారని కొందరు సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఆ పదవీ ఈ పదవీ అన్నారు. చివరకు పదవి దక్కలేదు. హతాశురాలైన రోజా జగన్ మీద కోపం తెచ్చుకుంది. అలిగింది. తట్టుకోలేని జగన్ ఆమెకు ఏపీఐఐసీసీ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టాడు. 

ఏపీలో బాధ్యతలు నిర్వహించాల్సిన రోజా హైదరాబాద్ లోనే ఉంటూ ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాంలో నవ్వుల పువ్వులు పూయిస్తూ బాగానే సంపాదించుకుంది. తానొక ప్రభుత్వ పదవిలో ఉండాలి కాబట్టి ఉన్నది. అంతే. అయినా అది మంత్రి పదవి కాదు కదా. అంత సీరియస్ గా చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంది. సరే ఇప్పుడు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం మంత్రి పదవి కోసం వెయిటింగ్. 

ఇదివరకు  జగన్ సామాజిక సమీకరణాల వల్ల రోజాకు పదవి ఇవ్వలేకపోయాడు. రోజా అలాగని తన మనసులో ఆగ్రహాన్ని దాచుకోలేదు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి గైర్హాజరయి తన నిరసనను తెలియచేసింది. చివరకు జగన్ దిగి రావాల్సి వచ్చింది. ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చాడు. దీంతో రోజా కొంత శాంతించింది. కానీ ఈసారి అలా కాదు. 

మంత్రి పదవి ఈ విస్తరణలోనూ రాకుంటే రోజా రియాక్షన్ మామూలుగా ఉండదని కొందరు చెబుతున్నారు. పంచ్ మామూలుగా ఇవ్వదన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రోజాకు మంత్రి పదవి ఇవ్వకూడదని జగన్ కు ఏ కోశానా ఉండదు. కానీ రెడ్డి సామాజికవర్గం నేత కావడం వల్లనే ఆమెకు మంత్రి పదవి దక్కడం చివరి నిమిషం వరకూ చెప్పలేం.

ఎందుకంటే రోజాకు పదవి ఇవ్వాలా వద్ద అని నిర్ణయించేది జగన్ కాదు మంత్రి పెద్ది రెడ్డి అంటున్నారు కొందరు. రోజాది చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని జగన్ ఏమీ చేయలేడు. అంటే పెద్దిరెడ్డి కి జగన్ అంత విలువ ఇస్తాడు.  

పెద్దిరెడ్డి కూడా జగన్ అప్ప జెప్పిన పనిని అలాగే పూర్తి చేస్తాడు. కానీ రోజా పార్టీ పట్ల అంకిత భావంతో ఉంటుంది. జగన్ మీద మాట పడితే ఊరుకోదు. విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి రోజా లాంటి అతి కొద్ది మంది నేతలే ప్లస్ అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. 

రోజా అన్నా జగన్ కు కూడా బాగా ఇష్టం. మరి ఈసారి కూడా ఆమెకు రెడ్డి సామాజిక వర్గం అడ్డు పడుతుందా? రాజకీయ సమీకరణాల్లో ఏం జరుగుతుందో ఏం చెప్పగలం.