టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. అంతేకాదు, ఖాళీ లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి ఓ చానల్‌కు ఇచ్చారు. టీడీపీ నేతలు తమ ఇష్ట ప్రకారం ఆ ఖాళీ లెటర్ ప్యాడ్‌పై రాజీనామా లేఖ రాసి స్పీకర్‌కు ఇవ్వాలని కోరారు. గన్నవరంలో పోటీకి సిద్ధమని, ఇక్కడికి వచ్చి తేల్చుకోవాలని పరిటాల సునీతకు వల్లభనేని వంశీ సవాల్ విసిరారు.
చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా వేదికపై నుంచి పరిటాల సునీత ఆవేశంగా, రెచ్చగొట్టేలా మాట్లాడారు.
‘ ఈసారి వచ్చేది టీడీపీనే. మా ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్లందరికీ చుక్కలు చూపిస్తాం. మేం రాసుకున్నాం.. తప్పకుండా ప్రతి ఒక్కరి అకౌంట్ సెటిల్ చేస్తాం.. అందరి లెక్కా తేలుస్తాం. వంశీ, నాని లాంటి వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. తనతో పాటు కొడాలి నానీని ఓడిస్తామని పరిటాల సునీత హెచ్చరించడంపై వంశీ ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు వయసు పైబడుతోందని, ఆయన ఎంత కాలం జీవించి ఉంటారో తెలియదని వంశీ అన్నారు. ఇంకా రెండున్నరేళ్ల సమయం వేచి ఉండడం వృథా అన్నారు. తానిప్పుడే రాజీనామాకు సిద్ధమంటూ సంతకం చేసిన లెటర్‌ను ఓ చానల్ ప్రతినిధికి వంశీ అందజేసి సంచలనం సృష్టించారు. గన్నవరంలో తనపై పోటీకి పప్పునాయుడో, తుప్పునాయుడో, వాళ్ల బాబు చంద్రబాబో ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు.
పరిటాల సునీతను తాను వదినగా భావిస్తున్నట్టు తెలిపారు. గన్నవరం వచ్చి పరిటాల సునీత కృష్ణ సారథ్యమో లేక శల్య సారథ్యం వహిస్తారో ఆమె ఇష్టమన్నారు. పరిటాల సునీతకు ఇప్పుడే ఎందుకు కోపం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చంద్ర బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ సునీత చదివారని ఎద్దేవా చేశారు.
గుడివాడలో కొడాలి నానీని పరిటాల సునీత మంత్రిగా ఉండి కూడా ఓడించలేక పోయారనే గుర్తు చేశారు. వల్లభనేని సవాల్‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.