తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ ప్రయాణంలోని ప్రధాన అజెండా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఫిర్యాదు చేయడం! ఎందుకు రాష్ట్రపతి పాలన? అంటే.. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని! మరి దాడులెందుకు జరిగాయి? అనే ప్రశ్నను ఢిల్లీలో ఎవరూ వేయరనేది చంద్రబాబు కాన్ఫిడెన్స్ కాబోలు.
తన ఏకపాత్రాభినయానికి మెచ్చి, 36 గంటల పాటు దీక్ష చేసి ఢిల్లీ వచ్చినట్టుగా ఏడ్చి మొత్తుకుంటే.. అక్కడ తనపై సానుభూతి వర్షిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్టుగా ఉన్నారు.
ముందుగా ముఖ్యమంత్రిని తమ పార్టీ నేతొకడు ఇష్టానుసారం తిట్టాడని, అందుకు ప్రతిఫలంగా తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగినట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడ చెప్పగలరా? ఉన్నఫలంగా తమ పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయని తప్పుడు ఫిర్యాదులను మాత్రమే చంద్రబాబు చేయాలక్కడ. అయితే ఈ ఫిర్యాదులు తీసుకునే వారైనా.. ఏంటి కథ? అని ఆరాతీస్తారు. ఎందుకంటే.. చంద్రబాబు చేస్తున్నది మామూలు డిమాండ్ కాదు, ఏకంగా రాష్ట్రపతి పాలన!
మామూలుగా తమ పార్టీని ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని ఫిర్యాదు చేస్తే… ఆ ఫిర్యాదును అంత వరకే చూసే అవకాశం ఉంది ఢిల్లీ వాళ్లైనా. అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతితో సహా బీజేపీ వాళ్లను కోరబోతున్నారట.
మరి రాష్ట్రపతి పాలన అంటే.. ఎందుకు, ఏమిటి, ఎలా.. అనే అంశాలపై కేంద్ర కేబినెట్లో చర్చ జరగాలి! ప్రధానమంత్రి నాయకత్వంలో చర్చ జరిగి, కేంద్ర హోం శాఖ కు బాధ్యతలన్నీ అప్పగించేయాలి! దీనిపై కేబినెట్ ఆమోద ముద్ర పడితే, అప్పుడు రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇందుకు సంబంధించిన ఫిర్యాదుతో చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు.
అలాంటప్పుడు దాని ముందూ వెనుక కథేంటంటూ ఎవరైనా అడిగితే ఏదో కాకమ్మ కథ చెప్పాలి. అసలు కథను చెబితే మాత్రం, అంతకన్నా సిగ్గులేని అంశం ఉండదు. తాము తిట్టామని, తమను కొట్టారని.. చెబితే, చాళ్లేవయ్యా వెళ్లు! అనే చెబుతారు ఎవరైనా! అయినా మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కడం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటేగా!