ఒక్క దెబ్బకు రెండు పిట్టలు నేల రాలిన చందంగా… తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఒకే ఒక్క విమర్శతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ గింజుకుంటున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల ముంగిట ఆ రెండు పార్టీలను కేటీఆర్ అదును చూసి చావు దెబ్బ తీశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని నమ్మించేలా మంత్రి కేటీఆర్ ఆరోపణలుండడం గమనార్హం.
బీజేపీ, కాంగ్రెస్‌లపై కేటీఆర్ ఆరోపణల ‘ఈటెలు’ సంధించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపించే తరుణంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శల హోరు పెరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కాంగ్రెస్ నేతలతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో ఈటల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కలుసుకున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. వారి భేటీ వెనక మతలబేంటని ఆయన నిలదీయడం …ఆ రెండు పార్టీలను ఆత్మ రక్షణలో పడేసింది. ఈటల, రేవంత్ కలిశారో లేదో స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈటల, రేవంత్ కలిసినట్లు ఉన్న ఆధారాలు బయటపెడతాం అని ఆయన దూకుడు ప్రదర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల కొనసాగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.