సుశాంత్ సింగ్ మరణం తర్వాత అతడిపై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అటుఇటు తిరిగి ఈ కేసు అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తి మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోణంలో కూడా ఈ కేసు గట్టిగా నిలబడేలా కనిపించడం లేదు.
మొన్నటివరకు సుశాంత్ అకౌంట్ లో ఉన్న 15 కోట్ల రూపాయలు ఏమయ్యాయనే కోణంలో దర్యాప్తు జరిగింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రంగంలోకి దిగిన ఈడీ, ఈ మేరకు రియాను ప్రశ్నించింది. సుశాంత్ ఎకౌంట్ నుంచి రియాకు చెందిన 2 కంపెనీల్లోకి ఈ డబ్బంతా మళ్లినట్టు కేకే సింగ్ ఆరోపించారు.
అయితే తాజాగా ఈడీ తేల్చిందేంటంటే.. అలాంటి భారీ లావాదేవీలు ఏవీ జరగలేదంట. కొటాక్ బ్యాంక్ ఎకౌంట్ లో గత ఆర్థిక సంవత్సరంలో సుశాంత్ ఎకౌంట్ లో 15 కోట్ల రూపాయలు ఉన్న మాట నిజమే. అతడు ఆ ఎకౌంట్ ను పన్నులు చెల్లించడానికి, తన రవాణా ఖర్చుల నిమిత్తం వాడుతున్నట్టు గమనించిన ఈడీ.. ఈ ఏడాదిలో ఆ ఎకౌంట్ నుంచి భారీ లావాదేవీలేవీ జరిగినట్టు గుర్తించలేదు.
తాజాగా తేల్చిందేంటంటే… సుశాంత్ ఎకౌంట్ నుంచి రియా ఎకౌంట్, ఆమె సోదరుడి ఎకౌంట్ లోకి కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే ట్రాన్సఫర్ అయ్యాయట. గడిచిన 2 రోజులుగా రియాను ప్రశ్నించిన ఈడీ.. ఈ కోణంలో కాకుండా ఆమె వ్యక్తిగత ఆస్తులు, కంపెనీల లావాదేవీలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఆమె ఆదాయం-ఖర్చుల మధ్య పొంతన లేకపోవడంతో ఆ మేరకు పత్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
ఇప్పటివరకు ఈ కేసులో రియా ఆమె సోదరుడితో పాటు.. రియా తండ్రి ఇంద్రజిత్, రియా బిజినెస్ మేనేజర్ శృతి మోడీ, సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానీ, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ (రియా నియమించిన వ్యక్తి), సుశాంత్-రియా ఎకౌంటెంట్లు, సుశాంత్ సోదరిని.. ఈడీ ప్రశ్నించింది.