Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గుంజన్‍ సక్సేనా

సినిమా రివ్యూ: గుంజన్‍ సక్సేనా

సమీక్ష: గుంజన్‍ సక్సేనా (హిందీ)
రేటింగ్‍: 3/5
బ్యానర్‍: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‍
తారాగణం: జాన్వీ కపూర్‍, పంకజ్‍ త్రిపాఠి, అంగద్‍ బేడి, మానవ్‍ విజ్‍, వినీత్‍ కుమార్‍ సింగ్‍, అయేషా రజా మిశ్రా తదితరులు
బాణీలు: అమిత్‍ త్రివేది
నేపథ్య సంగీతం: జాన్‍ స్టీవర్ట్ ఏడూరి
కూర్పు: నితిన్‍ బైద్‍
ఛాయాగ్రహణం: మనూష్‍ నందన్‍
రచన: నిఖిల్‍ మెహోత్రా, శరణ్‍ శర్మ
నిర్మాతలు: కరణ్‍ జోహార్‍, జీ స్టూడియోస్‍, హిరూ యష్‍ జోహార్‍, అపూర్వ మెహతా
దర్శకత్వం: శరణ్‍ శర్మ
విడుదల తేదీ: ఆగస్ట్ 12, 2020
వేదిక: నెట్‍ఫ్లిక్స్

చిన్నప్పట్నుంచీ ఆమెది ఒకటే కల. పైలట్‍ అయి గాల్లో ఎగరాలని. ఇప్పుడది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఎనభైవ దశకంలో ఆడపిల్లలకు అలాంటి కలలు కనే స్వేఛ్ఛ లేదు. ఒకవేళ కలగన్నా అవి కలలుగానే మిగిలిపోయేవి. కానీ గుంజన్‍ సక్సేనా తన కల సాకారం చేసుకునే వరకు విడిచి పెట్టలేదు. ఆ ప్రయాణంలో ఆమెకు అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలే. ఒకానొక దశలో అందరు అమ్మాయిలలా పెళ్లి చేసుకుని ‘సెటిల్‍’ అయిపోవాలని కూడా అనుకుంది. కానీ ఒక ఆడపిల్ల కన్న కలకు తండ్రి తోడ్పాటు వుంటే ఆమె ఎంత ఎత్తుకి ఎదిగి, ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే దానికి గుంజన్‍ సక్సేనా జీవతమే ఒక ఉదాహరణ. 

కార్గిల్‍ యుద్ధంలో కాంబాట్‍ ఫ్లయిట్‍ పైలట్‍గా గొప్ప సేవలు అందించి శౌర్య చక్ర అవార్డు అందుకున్న  గుంజన్‍ సక్సేనా... కాంబాట్‍ ఫ్లయిట్‍ పైలట్స్ లో తొలి మహిళ కూడా. అంటే అంతవరకు ఎవరూ నడవని దారిలో ఆమె నడిచారు. కొత్త దారిలో ముందుగా వెళ్లే ఎవరికీ సరయిన బాట వుండదు. ముళ్లను తొక్కుకుంటూ, ఎత్తు పల్లాలు దాటుకుంటూ గమ్యం దిశగా ముందుకెళ్లాలి. పైలట్‍ అవుతానని చిన్నప్పుడు డైనింగ్‍ టేబుల్‍ దగ్గర చెప్పినప్పట్నుంచీ ఆమెని అందరూ కిందకి లాగినవాళ్లే. ఎగరనివ్వకుండా పంజరంలో వుండిపోమని చెప్పినవాళ్ళే... ఒక్క తన తండ్రి తప్ప. సక్సేనా ఆశలకు రెక్కలిచ్చిన తండ్రి పాత్ర ఈ చిత్రంలో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

పైలట్‍ అయితే చాలనుకుంటూ అందుకోసం విద్యార్హత సాధించిన గుంజన్‍కి పైలట్‍ ట్రెయినింగ్‍ చాలా కాస్ట్లీ అని తెలిసి వస్తుంది. దాంతో ఇక పైలట్‍ అయ్యే కల నిజం కాదనుకుంటే... ఎయిర్‍ఫోర్స్ నుంచి మహిళలకు ఆహ్వానం పలుకుతూ ప్రకటన వస్తుంది. ఇలాగయినా పైలట్‍ కావచ్చునని గుంజన్‍ ఎయిర్‍ఫోర్స్లో జాయిన్‍ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. పైలట్‍ కావాలనే కలే తప్ప దేశ సేవ చేయాలని లేదు కదా... ఇలా కల సాకారం చేసుకోవడం కోసం ఎయిర్‍ఫోర్స్లోకి వెళితే అది ద్రోహం చేసినట్టు కాదా అని అమాయకంగా తన తండ్రిని అడుగుతుంది. చేసే పనిని సిన్సియర్‍గా చేస్తే అదే గొప్ప దేశ సేవ, ‘భారత్‍ మాతా కీ జై’ అని గట్టిగా అరవడం కాదు అనేది ఆయన సమాధానం. ఆయన కూడా ఒక ఆర్మీ ఆఫీసర్‍ కావడం ఈ మాటలకి మరింత వెయిట్‍ ఇస్తుంది. గుంజన్‍ సక్సేనా కథలోని ఆత్మ అంతా ఈ సంభాషణలోనే వుంది. 

‘కార్గిల్‍ గాళ్‍’గా పేరొందిన మహిళ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారంటే భారీ యుద్ధ సన్నివేశాలు, పాకిస్తాన్‍ కుటిలత్వాన్ని ఎండగట్టే సంభాషణలు లాంటివి వుంటాయనుకోవద్దు. కార్గిల్‍ వార్‍లో గుంజన్‍ సక్సేనా ఏమి చేసిందనేది చూపించే సన్నివేశం ఒక్కటి మాత్రమే వుంది. అక్కడివరకు వెళ్లడానికి, తనను ‘బలహీనురాలిగా’ చూసిన వారికి తన పట్ల దృక్పధం మారడానికి ఆమె చేసిన ప్రయాణం, పడిన మానసిక సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన కథావస్తువయింది. అందుకే కార్గిల్‍లో ఆమె ధైర్యసాహసాలను పతాక సన్నివేశానికి మాత్రమే పరిమితం చేసారు. 

గుంజన్‍ సక్సేనా సినిమా మాత్రం ఆమెకి హీరో తరహా ఇంట్రడక్షన్‍తో మొదలవుతుంది. అక్కడ కట్‍ అయి ఆమె ఎక్కడ్నుంచి మొదలుపెట్టి ఇక్కడకు వచ్చిందనేది తెలుస్తుంది. జీవితంలో ఏ దశలోను తన కలను గుంజన్‍ సక్సేనా విడిచిపెట్టలేదు. ఏదో ఒక రోజు అది మరచిపోతుందని ఆమె తల్లి ఎదురు చూస్తుంటుంది కానీ గుంజన్‍ మాత్రం ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురయినా దాటుకుంటూ వెళుతుంది. తీరా అన్నీ సాధించేసి ఎయిర్‍ఫోర్స్లో జాయిన్‍ అయిన తర్వాత పురుషులకి మాత్రమే అన్నట్టు ముద్ర పడిపోయిన ప్రపంచంలో ఆమె అనేక ఇబ్బందులకు గురవుతుంది. అయినప్పటికీ దేశానికి అవసరం వచ్చినపుడు పురుషులకి తీసిపోని విధంగా ఆమె ఎలా సేవలు అందించి ‘హీరో’ అయిందనేది స్ఫూర్తిదాయకం. 

జాన్వీ కపూర్‍ ఇంకా పరిపూర్ణ నటి కాదు. ఆమెలో ఇంకా ఆ రిజిడ్‍నెస్‍ కనిపిస్తోంది. అయితే గుంజన్‍ సక్సేనా పాత్రకు కావాల్సిన అమాయకపు మొహం, బేలతనం ఈ పాత్రకు జాన్వీ పర్‍ఫెక్ట్ సూట్‍ అనిపిస్తాయి. ఉద్వేగపూరిత సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. చివరి సన్నివేశంలో తన సోదరుడితో సన్నివేశంలో జాన్వీ ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. పంకజ్‍ త్రిపాఠి లాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకూ వుండాలనేంత గొప్ప పాత్ర. ఎటువంటి ఓవర్‍ ప్లే లేకుండా చాలా నిదానంగా మాట్లాడుతూ ఎఫెక్టివ్‍గా డ్రామా ఎలా పండించాలనే టెక్నిక్‍ ఈయనకు తెలిసినట్టు బహుశః మరెవరికీ తెలిసుండదేమో. అంగద్‍ బేడీ క్యారెక్టర్‍ వన్‍ డైమెన్షనల్‍ అనిపిస్తుంది. మానవ్‍, వినీత్‍ కుమార్‍ నటన బాగుంది. 

పాటలు ఓకే కానీ మరీ రెగ్యులర్‍ బాలీవుడ్‍ డ్రామాలో వున్నన్ని పాటల అవసరం లేదేమో అనిపిస్తుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి. సంభాషణల్లో చాలా వరకు గుర్తుండిపోతాయి. దర్శకుడు శరణ్‍ శర్మ ఒక ఎయిర్‍ఫోర్స్ ఆఫీసర్‍, ఒక నేషనల్‍ హీరో కథలా దీనిని డీల్‍ చేయలేదు. ఒక సగటు అమ్మాయి కథలానే చెప్పాడు. ఆమెని హీరోగా చూపించడం కంటే ఆమె హీరో కావడానికి పడ్డ స్ట్రగుల్‍ ఏమిటనేది చూపించాడు. ఈ క్రమంలో కొందరిని అవసరానికి మించి కటువుగా, విలన్స్ లా చూపించడం సినిమాటిక్‍ లిబర్టీ అనుకోవచ్చు. ఏదేమైనా ఒక ఇన్‍స్పయిరింగ్‍ స్టోరీని మరింతమంది ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చేలా, చాలా మంది మగాళ్ల ఆలోచనల్లో మార్పు తెచ్చేలా చెప్పగలిగాడు.

బాటమ్‍ లైన్‍: ప్రేరణనిచ్చే మహిళ కథ! 

గణేష్‍ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?