దాదాపు అయిదు నెలలు అయిపోయింది థియేటర్ తెరమీద బొమ్మపడి. మరో నెలకు అయినా తెరుచుకుంటాయో, వీలుకాదో తెలియదు. కానీ టాలీవుడ్ పరిస్థితులు చూస్తుంటే అసలు థియేటర్లు తీసి ఏం చేయాలి? అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. విడుదలకు కాస్త అటు ఇటుగా ఓ డజను సినిమాల వరకు వున్నాయి. కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఓటిటి కోసం ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు వున్నాయి. ఇవ్వాళ కాకుంటే రేపయినా ఓటిటికి సినిమాలు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
నిశ్శబ్దం ఓటిటికి వెళ్లడం ఖాయం. డేట్ అన్నదే తెలియాల్సి వుంది. సోలో బతకే సో బెటరు ఇప్పటికే జీ టీ వీ తో డీల్ అయిపోయింది. రెడ్, క్రాక్, వి, ఒరేయ్ బుజ్జిగా ఇవన్నీ కూడా అవకాశం కోసం చూస్తున్నాయి. అంతే. ఉప్పెన ఒక్కటే థియేటర్ రిలీజ్ పక్కా అని తెలుస్తోంది. థియేటర్లు ఓపెన్ కావడానికి మరో నెలా రెండు నెలలు టైమ్ తీసుకుంటే సినిమాలు అన్నీ ఓటిటి దారి పట్టేస్తాయి.
అప్పుడు థియేటర్లు ఓపెన్ చేసి ప్రయోజనం లేదు.సెప్టెంబర్ లోగా థియేటర్లు ఓపెన్ అయితే ఓకె, అలా కాకుండా అక్టోబర్ నెలాఖరుకో, నవంబర్ కో అయితే ఇక ఓపెన్ చేయడం వృధా. ఎందుకంటే ఓపెన్ చేసినా వేసుకోవడానికి సినిమాలు వుండకపోవచ్చ.. మళ్లీ సంక్రాంతి వరకు సినిమాలు వుండవు.
పోనీ సెప్టెంబర్ లో థియేటర్లు తీసేసే అవకాశం వుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రలో కరోనా పల్లెటూళ్ల వరకు పాకేసింది. కేవలం కొన్ని ప్రాంతాలు అని కాకుండా అన్ని ప్రాంతాలకు సరిసమానంగా పాకేసింది. అందువల్ల మరో నెల వరకు కంట్రోల్ లో వస్తుందా? అన్నది అనుమానంగానే వుంది. విద్యాసంస్థలే సెప్టెంబర్ లో ప్రారంభం అవుతాయా? అన్నది తేలలేదు. అలాంటపుడు థియేటర్లు తెరవడం సాధ్యమేనా?
ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఓటిటికి వెళ్లిపోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఎటొచ్చీ అనుకున్న రేటు రావాలి. షూటింగ్ లు చేయడానికి వీలైన పరిస్థితి వుండాలి. అందువల్ల సంక్రాంతి వరకు థియేటర్లకు గడ్డు కాలమే.