తస్మాత్ జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకా ఏడాదికంటె ఎక్కువ దూరంలోనే ఉన్నాయి. పార్టీలు మహా అయితే వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇది. అయితే తెలుగుదేశం పార్టీ అప్పుడే ఎన్నికల గోదాలోకి దిగేసినట్లుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకా ఏడాదికంటె ఎక్కువ దూరంలోనే ఉన్నాయి. పార్టీలు మహా అయితే వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇది. అయితే తెలుగుదేశం పార్టీ అప్పుడే ఎన్నికల గోదాలోకి దిగేసినట్లుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో ఉండగల బీభత్స వాతావరణాన్ని ఇప్పటినుంచే ప్రజలకు రుచిచూపిస్తూ భీతావహుల్ని చేస్తోంది. తమ గురించి తాము చెప్పుకుని గెలవగలమనే నమ్మకం వారికి లేదు. జగన్ ప్రభుత్వం మీద నిందలు వేసి గెలవగలం అనే ఆశ కూడా లేదు. 

ఇలాంటి నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేసి.. ప్రభుత్వాన్ని అల్లరిపెట్టి.. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా, తమ మీద దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టి.. ప్రభుత్వాన్ని బద్‌నాం చేయాలని అనుకుంటోంది. శాంతిభద్రతల విచ్ఛిన్నం ప్రతిపక్షానికే ఎక్కువ లాభిస్తాయనే అంచనాతో ఇలాంటి దారుణాలను ప్లాన్ చేస్తున్నారు. మాచర్ల విధ్వంసం, తంబళ్లపల్లెలో తలెత్తిన ఘర్షణలు, ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం ముసుగులో.. రాష్ట్రమంతా వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఈ స్కెచ్ లో భాగమే. ఈ కుట్రల గురించిన విశ్లేషణే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర‌ స్టోరీ!

ఓటమి ఖాయం అని తెలిసినప్పుడు.. మనఃస్థితి ఎలా ఉంటుంది? దాన్ని జీర్ణించుకోవడానికి ఒక పట్టాన మనలోని అహం ఒప్పుకోదు. బాధ కలుగుతుంది. ఆయా వ్యక్తుల యొక్క బుద్ధిని బట్టి.. బాధలోంచి తమను తాము దిద్దుకోవాలని, మెరుగుపరచుకోవాలని కొందరికి ఆలోచన పుడుతుంది. తమను ఓడించిన వాడికి గెలుపు యొక్క మజా దక్కకుండా నాశనం చేసేయాలనే కుట్ర పూరితమైన ఆలోచన మరికొందరికి కలుగుతుంది. ఈ రెండో కేటగిరీకి చెందిన రాజకీయ నాయకుడు.. నారా చంద్రబాబునాయుడు. ‘‘ముసలివాణ్నయిపోయాను.. చివరిసారిగా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని ఉంది.. మీరందరూ నన్ను నా పార్టీని గెలిపించండి..’’ అంటూ దేబిరిస్తూ జనాన్ని మాయచేయాలని చూస్తే వర్కవుట్ అవుతుందని అనుకున్నారు. ఆ పాచిక పారలేదు. 

మరొకవైపు ఖరారైన ఓటమి కళ్లెదురుగా కనిపిస్తోంది. దానినుంచి తప్పించుకోగల దార్లు లేవు. అసహనం పెరిగిపోతోంది. అందుకే.. నన్ను గెలిపించని ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండనే కూడదు అనే భావనకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి ప్రబలడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ‘ఇదేం ఖర్మ’ పేరుతో ఓ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. దీనికి తరువాయి భాగంగా పుత్రుడి పాదయాత్ర ఉంది, దత్తపుత్రుడి వారాహియాత్ర కూడా ఉంది! ప్రతి సారీ స్థానికంగా ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేయాలి.. ఘర్షణలు రేగాలి.. సమాజంలో శాంతి భద్రతలు క్షీణించాయనే భావన ప్రజల్లో కలిగించాలి.. అనేదొక్కటే తాజా వ్యూహంగా కనిపిస్తోంది. 

ఓటమి భయానికి రుజువేమిటి?

తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో 170 వరకు అసెంబ్లీ సీట్లను గెలుస్తుందని చంద్రబాబునాయుడు ప్రకటిస్తుంటారే.. వైసీపీ గెలవబోయే సీట్లు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతాయని తన తైనాతీలో ప్రకటనలు ఇప్పిస్తుంటారే.. తాను గెలిచిన తర్వాత ఈ పథకాలు ఉండవనే దుష్ప్రచారం సాగుతున్నదని.. అలా జరగదని అన్నీ కొనసాగిస్తానని ప్రజలకు నమ్మబలుకుతుంటారే.. మరి ఇంత ఘనంగా చంద్రబాబునాయుడు తన విజయం గురించిన మాటలను ప్రవచిస్తున్నప్పుడు.. ఆయనలో ఓటమి భయం ఉన్నదని అంటున్నారేంటి చెప్మా అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. అనుమానం రావడం సహజమే.. కానీ ఆయనలో ఓటమి భయం ఉన్నదీ నిజమే. దానికి రుజువులు కూడా ఉన్నాయి.

పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకోవాలనే కోరిక తనకు ఉన్నదని, తనది వన్ సైడ్ లవ్ లాగా అయిపోతున్నదని.. కన్నుగీటి తన ప్రేమను బహిరంగ వేదిక మీద వ్యక్తంచేసినది ఎవరు? చంద్రబాబునాయుడు! అది మొదలుగా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను’ అనే నినాదంతో చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడుతున్నది ఎవ్వరు? పవన్ కల్యాణ్! ఈ ఇద్దరికీ కూడా ఎన్నికల్లో ఏం జరగబోతున్నదో ఒక క్లారిటీ ఉన్నది గనుకనే.. పొత్తులు పెట్టుకుని పోరాడడానికి ఊరేగుతున్నారు. వారికి ఉన్న ఆ క్లారిటీ పేరే ఓటమి భయం!

తమ పార్టీలు రెండింటికీ పది ఓట్లు వస్తే అందులో అయిదు.. జగన్ వద్దనుకునే ఓట్లు ఉంటాయని వారికి నమ్మకం. అదే సమయంలో జగన్ కు పది ఓట్లు వస్తే.. ఆ పది కూడా పూర్తిగా జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకునే ఓట్లు మాత్రమే. అంటే ఏమిటన్నమాట.. చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ… వారి పాలన కావాలని కోరుకునే వారు చాలా పరిమితంగా మాత్రమే ఉంటారని వారికి కూడా తెలుసు.

జగన్ ని వద్దనుకుంటున్నవాళ్లు వేరే గతిలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా తమకే మద్దతిస్తే, అప్పుడు తాము నెగ్గగలమని వారి కోరిక. స్థూలంగా చూసినప్పుడు.. ‘జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకునే’ ఓటు శాతమే అధికంగా ఉంటుంది గానీ.. తమ పొత్తుల ద్వారా.. ఆ మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ.. ఒక అపవిత్రమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది వారి పేరాశ! ‘జగన్ మోహన్ రెడ్డి కావాలని ఎందరు కోరుకుంటున్నారో.. అంతమంది చంద్రబాబు కావాలని గానీ, పవన్ కల్యాణ్ గానీ కావాలని కోరుకోవడం లేదు..’  అని ఈ పొత్తు నిర్ణయం ద్వారా వారిద్దరూ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నట్టే లెక్క. సింహం సింగిల్ గా వస్తుంది అనే సినిమా డైలాగ్ చెప్పినట్టుగా.. ఎన్నికల బరిలో ఒంటరిగా తలపడడానికి ఇష్టపడే జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేం అని  డిసైడ్ అయినప్పుడే.. ఈ రెండు పార్టీ తమ ఓటమిని ఒప్పేసుకున్నాయి. కాకపోతే.. పొత్తులుపెట్టుకుంటున్నాం.. వ్యతిరేక ఓటును చీలనివ్వం అనే అందమైన మాటల ముసుగులో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. 

విధ్వంసకాండకు స్కెచ్..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చేపడుతున్న సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. తన సంక్షేమమే తనకు అండ అని, మళ్లీ గెలిపిస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నారు. పార్టీ నాయకులు, శ్రేణులతో కూడా ఆయన నిత్యం చెబుతున్నది ఒక్కటే మాట.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి జరిగిందో చెప్పండి చాలు.. విజయం దక్కుతుంది అనేదే! అంత కాన్ఫిడెంట్ గా తాను ప్రజలకు చేసిన మంచి మళ్లీ గెలిపిస్తుందని నిమ్మళంగా ఉన్నారు. ఆయనలోని ఆ గెలుపు ధీమానే  రాజకీయ ప్రత్యర్థులకు కునుకులేకుండా చేస్తోంది. 

తాము ఎటూ ఓడిపోతున్నాము.. గెలవబోయే వాడిని మనశ్శాంతిగా ఎందుకు ఉండనివ్వాలి.. అనే దురాలోచనతో చంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు రేగడం కోసమే ఆయన పార్టీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకుంటాం అని ఓ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఆ మేరకు తెలుగుదేశం నాయకులు ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలి. అయితే.. ఆ కార్యక్రమం పేరుతో ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు నిర్వహించడం కాదు మౌలిక ఉద్దేశ్యం. ప్రజలనుంచి సేకరించిన సమస్యలను తమ మేనిఫెస్టో లో పెట్టాలని చంద్రబాబు అనుకున్నారు. 

అలవిమాలిన హామీలను మేనిఫెస్టోలో ప్రకటించేసి.. ప్రజలను వంచించడానికి పూనుకుని ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత.. పార్టీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో పీడీఎఫ్ ను మాయం చేసి.. ఆధారాలను మాయం చేయాలనిచూసే నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడుది. చేయదలచుకున్నదంతా క్లుప్తంగా మేనిఫెస్టోగా ప్రకటించి.. అందులో 95 శాతం పూర్తిచేసేశానని మళ్లీ ఒక కరపత్రం ముద్రించి.. ఆధారాల సహా ఇంటింటికీ దానిని పంపిణీచేసే సాహసం జగన్ ది. అందుకని ఆ సాహసాన్ని ఎదుర్కోలేక కుట్ర రచన చేశారు.

ఎక్కడికక్కడ అల్లర్లు రేగాలి..

మాచర్ల ఘటనలను జాగ్రత్తగా గమనిస్తే.. తమ కాలనీలోకి రావాల్సిన అవసరం లేదని ఆపిన వారిని మొదటిసారిగా దాడిచేసి కొట్టింది తెలుగుదేశం గూండాలే. ప్రతిదాడి మాత్రమే వైసీపీ వారు చేశారు. ‘మా దెబ్బకు జడిసి వైసీపీ వారు పారిపోయారు’ అని జూలకంటి బ్రహ్మారెడ్డి స్వయంగా చెప్పిన సంగతి గమనార్హం. తెలుగుదేశం కోరుకున్నంత విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని రాష్ట్రవ్యాప్తంగా జాలి పొందడానికి వాడుకోవాలనేది వారి కుట్ర. ఒక ఊరిలో రేపిన అల్లర్లు రాష్ట్రమంతా సానుభూతి తేవడం కష్టమనే ఉద్దేశంతో ప్రతిచోటా ఇలాంటి కుట్రలే చేస్తున్నారు. ఇవాళ తంబళ్లపల్లెలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి.. వాటిని సద్దుమణిగేలా చేశారు. 

అయితే కాస్త జాగ్రత్తగా గమనించినప్పుడు.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం ముసుగులో వీలైనంత వరకు ప్రతిచోటా అల్లర్లు రేపడానికి తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా.. జగన్ సర్కారును ఇష్టపడే ప్రజలను, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మిస్సయితే.. నారా లోకేష్ పాదయాత్ర ఉండనే ఉంది. ఎటూ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వాహన యాత్ర కూడా ఉంది. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడంలో పీహెచ్డీ చేసిన పవన్ కల్యాణ్.. ప్రజలు దాడులు చేస్తారనే నమ్మకంతోనే, ఆ కోరికతోనే.. దాడులకు తగిన రీతిలో గట్టివాహనం మిలిటరీ స్ట్రాంగ్ తో చేయించుకున్నారు. సామాన్య ప్రజలు కూడా రెచ్చిపోయి కొట్టేంతగా తన ప్రసంగాలు ఉండాలని ఆయన కోరిక. 

ఇలా ఊరూరా ఘర్షణలు, దాడులు జరుగుతూ ఉంటే.. జగన్ సర్కారు గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోంది.. ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ జాలి పొందవచ్చుననేది వారి ఆలోచన. జాలి– దాని ద్వారా ఓట్లు రాలేకపోతే గనుక.. తమ వేషాలను ప్రజలు గుర్తిస్తే గనుక.. కనీసం ఇలాంటి ఘర్షణలను రేపడం ద్వారా.. ప్రజలను భయావహ వాతావరణంలోకి నెట్టేసి ఎన్నికలంటేనే జడుసుకునేలా చేయాలని, తద్వారా లబ్ధి పొందాలనేది ఒక ఆలోచన. అప్పటికీ తాము ఓడిపోయినా సరే.. తాము సంకల్పిస్తున్న హింస, విధ్వంసం ఫలితంగా మిగిలే రావణకాష్టం మాత్రం జగన్ ఏలుకోవాలని.. శాంతి భద్రతల పరంగా ఘోరంగా తయారైన రాష్ట్రాన్ని అప్పజెప్పాలనేది వారి కుట్ర. 

పోలీసుల పాత్ర కీలకం..

మాచర్ల, తంబళ్లపల్లెలో జరిగిన ఘర్షణలు, విధ్వంసం కేవలం శాంపిల్ మాత్రమే. ఇవి ఊరూరా జరిగే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు చాలా జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల కుట్రలను నిరోధించడం అంటే.. అది కేవలం పోలీసులకు మాత్రమే సాధ్యం. విపక్ష పార్టీలు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా వాటిని అడ్డుకోవాలి. నిజానికి వైసీపీ శ్రేణులు కూడా సంయమనం పాటించాలి. వారు కవ్వించినా వీరు మౌనంగా ఉండాలి. తమను రెచ్చగొట్టడానికే వారు స్కెచ్ వేస్తున్నారని తెలుసుకోవాలి. 

ప్రజల వద్దకు వెళ్లడానికి నిజానికి విపక్షాలకు దమ్ములేదు, ఎజెండా లేదు, సుభిక్షంగా ఉన్న ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం లేదు. అందుకే ఇలాంటి వక్రమార్గాలను ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అల్లర్లు పెచ్చరిల్లితే, శాంతిభద్రతలు దెబ్బతింటే.. తమ యాత్రలను పోలీసులు ఆపేయాలని వారి కోరిక. ఆపేస్తే.. మాకు భయపడి నిషేధాజ్ఞలు విధిస్తున్నారని రచ్చ చేయవచ్చు. యాత్రలను అనుమతిస్తే.. మరింత రెచ్చగొట్టి అల్లర్లకు బీజం వేయవచ్చు. ఇలాంటి విషపూరితమైన విధానాలతో చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యవహరిస్తున్నారు. అందుకే యావత్ రాష్ట్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ కుట్రలను గమనించాలి. ప్రజలే మేలుకుని తిప్పికొట్టాలి. 

..ఎల్. విజయలక్ష్మి