36 గంటల దీక్ష నాటకానికి తెరపడింది. ఇదే సమయంలో వివిధ కారణాలతో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేచింది. ఇప్పుడే టీడీపీకి అసలుసిసలు పరీక్ష. పోలీసులు లేకుండా రాండి… తేల్చుకుందామని వైసీపీకి సవాల్ విసిరిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు స్థానిక సంస్థల ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీక్ష పేరుతో డ్రామాలు ఆడినంత సులభం కాదు ఎన్నికల్లో నెగ్గడం.
మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండడం గమనార్హం. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఎన్నికలకు సంబంధించి సోమ లేదా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంటుందా? లేక అధికార పక్షానికి తొడ కొడుతుందా? అనేది చర్చనీయాంశమైంది.
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని టీడీపీ మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం కుప్పం మున్సిపాలిటీలోనైనా సత్తా చూపి పరువు కాపాడుకుంటుందా? అనేది టీడీపీకి, చంద్రబాబుకు సవాల్‌గా మారింది. కుప్పం మున్సిపాలిటీలో గెలుపొందాలంటే గంటలు సరిపోవు, రోజుల తరబడి దీక్షలు చేయాల్సి వుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.