వినయ విధేయ రామ, ఇస్మార్ట్ శంకర్.. రెండూ మాస్ సినిమాలే. కానీ రిజల్ట్ లో మాత్రం ఎంతో తేడా. ఒకటి డిజాస్టర్ అయితే, ఇంకోటి డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. రెండు ఒకేసారి రిలీజ్ అవ్వలేదు కాబట్టి పోలిక పెట్టలేం. కానీ రెండు సినిమాలు ఒకే టైమ్ లో టీవీల్లో ప్రసారమయ్యాయి కాబట్టి కంపారిజన్ మొదలైంది. బుల్లితెరపై ఒకే స్లాట్ లో రెండు డిఫరెంట్ ఛానెల్స్ లో ప్రసారమైన ఈ సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ దే పైచేయిగా నిలిచింది.
రామ్-పూరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏకంగా 14.44 (ఏపీ, తెలంగాణ కలిపి) టీఆర్పీ వచ్చింది. ఇక హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈ సినిమా 20.71 టీఆర్పీతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్యామిలీ చిత్రాల్ని ఎక్కువగా ఇష్టపడే బుల్లితెర వీక్షకులు.. “ఇస్మార్ట్”ను పట్టించుకోరంటూ రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ తాజా టీఆర్పీలతో అవన్నీ తప్పని తేలిపోయాయి.
ఇక ఇస్మార్ట్ కు పోటీగా అదే టైమ్ లో ప్రసారమైన వినయవిధేయ రామ సినిమాకు అత్యల్పంగా 7.85 (ఏపీ, తెలంగాణ కలిపి) టీఆర్పీ మాత్రమే వచ్చింది. రామ్ చరణ్ మార్కెట్ కు, స్టార్ మాటీవీ రీచ్ కు ఈ రేటింగ్ చాలా తక్కువ. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినట్టుగానే బుల్లితెరపై కూడా ఫ్లాప్ షో అనిపించుకుంది.
ఇదే హీరో నటించిన రంగస్థలం సినిమాను గతంలో ఇదే ఛానెల్ లో ప్రసారం చేస్తే ఏకంగా 19.5 టీఆర్పీ వచ్చింది. అలా కంపేర్ చేసి చూసుకున్నప్పటికీ వినయ విధేయరామ బుల్లితెరపై ఫ్లాప్ అయినట్టే. ఇక ఎప్పట్లానే ఈవారం కూడా బాహుబలి సిరీస్ తన హవా నిలబెట్టుకుంది. టీవీల్లో ఎన్నిసార్లు ప్రసారం చేసినా ఈ సినిమాకు మినిమం టీఆర్పీ తగ్గడంలేదు.