సరిగ్గా ఐదునెలల కిందట లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఇవి. నాటి ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ కూడా భయపడింది. మానసికంగా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాణించలేమని ఆ పార్టీ వాళ్లు ఫిక్సయిపోయి ఉండవచ్చు కూడా. అయితే ప్రజానాడీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందనే విషయాన్ని చాటుతున్నాయి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది, హర్యానాలోనో ఎలాగోలా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. అందులో సందేహాలు లేవు.
అయితే మారిన సీట్ల సంఖ్య మాత్రం ఆసక్తిదాయకంగా ఉంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 21 అసెంబ్లీ సీట్లను కోల్పోయింది! 288 సీట్లున్న రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు ఇస్తున్నది కేవలం 101 మాత్రమే! మూడోవంతు సీట్లు మాత్రమే. దీన్నిబీజేపీ సెలబ్రేట్ చేసుకునే విజయం అనాలా? శివసేనకు కూడా ప్రజలు కోత వేశారు. ఆ పార్టీకి కూడా మూడు నాలుగు సీట్లు పోయాయి. ఇదే సమయంలో ఎన్సీపీ బలాన్ని పెంచుకుంది. 41 నుంచి 55 సీట్ల స్థాయికి పెరిగింది ఆ పార్టీ బలం. కాంగ్రెస్ మాత్రం పెరగలేదు, తగ్గలేదు.
అయితే కాంగ్రెస్ కు ఎంఐఎం గట్టిదెబ్బ వేసింది. ఏకంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇతరుల కేటగిరిలోని వారు 20 సీట్లకు పైగా నెగ్గారు! దీంతో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓట్ల షేరింగ్ లెక్కల బయటకు వస్తే.. ఎవరిది నిజమైన విజయమో ఒక అంచనాకు రావొచ్చు. రాష్ట్రాల వారీగా బీజేపీకి ఉన్న అనుకూలత ఎంతో కూడా అప్పుడు తేలిపోతుంది.
ఇక హర్యానాలో కూడా బీజేపీ పట్టుజారింది. కాంగ్రెస్ కోలుకుంది. గత పర్యాయం మినిమం మెజారిటీ సాధించింది బీజేపీ. అయితే ఇప్పుడు మెజారిటీ కోసం పక్కచూపులు చూస్తోంది. ఇండిపెండెంట్ల సహకారంతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. కాంగ్రెస్ కోలుకున్నా, అధికారం చేజిక్కించుకోలేకపోతోంది. జేజేపీ కలిసి వచ్చినా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇండిపెండెంట్లను బీజేపీతన వైపుకు తిప్పుకోగలదు. కాబట్టి.. ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అయితే గట్టిగా పని చేసుకోమని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో స్థానముందని కాంగ్రెస్ కు ప్రజలు ఈ ఎన్నికలతో భరోసానే ఇచ్చారు!