ఏపీ ప్రభుత్వంపై నిరసనగా చంద్రబాబు 36 గంటలు దీక్ష.. ఇది తెరపై కనిపించే హెడ్డింగ్. కానీ తెరవెనక బాబు అజెండా వేరు. స్థానిక ఎన్నికలతో పూర్తిగా పడుకున్న పార్టీని తీసుకొచ్చి నిలబెట్టడం ఆయన వ్యూహం.
చీలిక పేలికలైన పార్టీని పునర్నిర్మించుకోవడం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఆయన సాధించారు. సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకుంటానంటూ ఎప్పటికప్పుడు చెప్పే బాబు.. ఈసారి తనే సంక్షోభం సృష్టించి, ఆ సంక్షోభాన్ని పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగించుకున్నారు.
పట్టాభితో ఓ సంక్షోభం సృష్టించి, అతడ్ని బలిపశువుని చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన బాబు.. పార్టీ ఆఫీస్ లో తాను హీరోగా ఎలివేట్ అవ్వడానికి, తన కొడుకుని యాక్టివేట్ చేయడానికి ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నారు. ఆ విషయంలో బాబు వందశాతం సక్సెస్ అయ్యారు.
చంద్రబాబు దీక్షలో పట్టాభి గురించి ఎవరూ తలచుకోలేదు, కానీ చంద్రబాబు మాత్రం 70ఏళ్ల వయసులో తమ కోసం దీక్షకు కదలివచ్చారంటూ అందరూ సంబరపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. అటోఇటో అనుకున్న కేశినేని నానిపై క్లారిటీ వచ్చేసింది. మందీ మార్బలంతో కేశినేని వచ్చేసి ప్యాచప్ చేసుకున్నారు.
ఇక కొంతమంది నేతలు జిల్లాల నుంచి భారీ కాన్వాయ్ తో వచ్చినట్టు సొంత మీడియాలో డప్పు కొట్టుకున్నారు. మనమెందుకు తగ్గాలంటూ ఇంకొంతమంది రెచ్చిపోయారు. ఇలా దాదాపుగా టీడీపీ శ్రేణుల్ని యాక్టివేట్ చేసారు బాబు.
లోకేష్ నియోజకవర్గం పై స్పష్టత..
ఇన్నాళ్లూ లోకేష్ నియోజకవర్గంపై స్పష్టత లేదు. ఇప్పుడు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పై దాడి జరగడంతో అక్కడ పార్టీపై సింపతీ పెరుగుతుందనే అంచనాకు వచ్చారు బాబు. ఇప్పటివరకూ లోకేష్ కి వేరే నియోజకవర్గం చూస్తున్నారని అనుకున్నారు.
కానీ చినబాబుని మంగళగిరి నుంచే పోటీ చేయించాలని అనుకుంటున్నట్టు ఈ దీక్షలో క్లారిటీ ఇచ్చారు. రికార్డు స్థాయి మెజార్టీ సాధించి బాబుకి గిఫ్ట్ ఇస్తానంటూ చినబాబు రెచ్చిపోయారు కూడా. అలా పరోక్షంగా తన నియోజకవర్గాన్ని ప్రకటించారు.
ఎవరు యాక్టివ్ గా ఉన్నారో తెలిసొచ్చింది..
మంగళగిరి దీక్షలో లోకేష్ కంటే రామ్మోహన్ నాయుడి హడావిడి బాగా ఉంది. బాబాయ్ అచ్చెన్నాయుడిని పక్కనపెట్టుకుని రెచ్చిపోయారు రామ్మోహన్ నాయుడు. దాదాపుగా యువ నాయకత్వం కదలివచ్చింది. ఆవేశపూరిత ప్రసంగాలతో యువతరం ఊగిపోయింది. సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు.
ఒకరకంగా పార్టీలో ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు. ఎవరిని దగ్గరకు తీయాలి, ఎవరిని పక్కనపెట్టాలి అనే ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది.
నెక్ట్స్ ఏంటి..?
ఎన్నికలకింకా టైమ్ ఉన్నా కూడా.. ఇప్పటినుంచే రంగంలోకి దిగాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఎక్కువగా ఉంది. అయితే దానికి సరైన మహూర్తం దొరకడం లేదు. ఈలోగా జగన్ పాదయాత్రలు, సచివాలయాల సందర్శన పేరుతో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు. దీంతో బాబు పక్కా వ్యూహంతోనే రాష్ట్రంలో అలజడి సృష్టించి.. ఆ వంకతో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు.
సరిగ్గా పట్టాభిని దానికోసం ఉపయోగించుకున్నారు. పార్టీ ఆఫీస్ పై దాడి అనే సింపతీతో చంద్రబాబు ఇక వరుసగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్ట్స్ ఏంటి..? అనేది బాబు ఈ సందర్భంగా ఫిక్స్ చేసుకున్నారు. ఢిల్లీ యాత్ర తర్వాత దాదాపుగా ఇక జనాల్లోనే ఉండాలనుకుంటున్నారు బాబు.