తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో సాధించిన మూడు సీట్లతో భారతీయ జనతా పార్టీ వీర లెవల్లో ఊగిపోయింది. తెలంగాణలో తదుపరి తామే అన్నంత రేంజ్ లో ఆ పార్టీ నేతలు హడావుడి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం తామేనంటూ మాట్లాడారు. అయితే హుజూర్ నగర్ ఉపఎన్నిక రూపంలో ఆ పార్టీకి స్పీడ్ బ్రేకర్ ఎదురైంది..
ఆ స్పీడ్ బ్రేకర్ ను దాటడంలో బీజేపీ పూర్తిగా స్లో అయిపోవడం గమనార్హం. హుజూర్ నగర్ లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ గల్లంతు అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధించిన ఈ బైపోల్ లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. విశేషం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీదీ ఇదే పరిస్థితి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేయని తెలుగుదేశం పార్టీ.. మళ్లీ ఈ బైపోల్ లో బరిలోకి దిగింది. బ్యాలెన్స్ పరువు పోగొట్టుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తోంది. ఓట్ల తేడా దాదాపు నలభై మూడువేల వరకూ ఉంది. ఇక మూడోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు నిలిచారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కనీసం మూడో స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయాయి.
ఇండిపెండెంట్ ఆ స్థానాన్ని దక్కించుకుని, ఆ పార్టీని మరింత వెనక్కునెట్టాడు. తెలుగుదేశం పార్టీకి ఏమోకానీ, భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇది పెద్ద ఝలక్కే అని పరిశీలకులు అంటున్నారు.