ఒక్కసారి దశాబ్దంన్నర కిందటి కాలానికి వెళితే.. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వాసంలో ఉండగా కూడా బాగా హడావుడి చేయడంలో రాయలసీమ తెలుగు తమ్ముళ్లు ముందుండే వారు! నాటి ఉమ్మడి ఏపీలో రాయలసీమ తెలుగుదేశం నేతలు ప్రతిపక్ష వాసంలో కూడా పరాక్రమం చూపే వారు. అది ఏరకంగా అయినా.. సరే, అధికార పక్షంతో ఢీ అనే వారు.
చంద్రబాబు నాయుడు ఒక పిలుపును ఇస్తే చాలు రాయలసీమ టీడీపీ నేతల హడావుడి ఒక రేంజ్ లో ఉండేది. ఆ హడావుడికి తోడు అనుకూల మీడియా ఇచ్చే ప్రచారంతో.. వీళ్ల పోరాటం ఒక రేంజ్ లో ఉందేమో అనిపించేది. ప్రజల మధ్యకు వెళ్లడంలో కానీ, పార్టీ తరఫు కార్యక్రమాల్లో కానీ.. రాయలసీమ నాలుగు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యే పరుగులుపెట్టే వారు. ఇదంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగే వ్యవహారం గురించి చెప్పడమే.
అదంతా గతం… ఈ పర్యాయం ప్రతిపక్షవాసంలో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నేతల నిస్తేజం మామూలుగా లేదు. ఇప్పటికే రెండున్నరేళ్ల సమయం పూర్తయ్యింది. కానీ ఇప్పటి వరకూ ప్రజల మధ్యకు వెళ్లడం కానీ, ప్రజల్లో నిలిచే కార్యక్రమం కానీ టీడీపీ ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టలేదు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రజల మధ్యకు వెళ్లిన దాఖలాలు లేవు. ఆయననే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్ చార్జిలు, నేతలు.
కనీసం కంచుకోటల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు లేవు. ఇందుకు తాజా ఉదాహరణగా గత వారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బంద్ పిలుపు కూడా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని, ప్రజాస్వామ్యానికి హాని జరుగుతోందంటూ చంద్రబాబు నాయుడు బంద్ పిలుపును ఇచ్చారు. తను బంద్ లకు పిలుపును ఇచ్చే టైపు కాదని చెప్పుకుంటూనే.. బంద్ కు పిలుపునిచ్చారు చంద్రబాబు.
అయినా తను బంద్ పిలుపులు ఇచ్చే టైపు కాదని చంద్రబాబు చెప్పుకోవడం పరమ కామెడీ. టీడీపీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఉన్న కాలంలో, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. బంద్ లు ఎలా నిర్వహించాలో పార్టీ క్యాడర్ కు క్లాసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే అని అప్పట్లో కొందరు జర్నలిస్టులు, ఎడిటర్లు రాసేవాళ్లు.
బందులు, నిరసనలు తెలపడం అంటే శాంతీయుతంగా కాదని.. రాళ్లు ఎగరాలని, అద్దాలు పగలాలని టీడీపీ నేతలకు బోధ చేసింది చంద్రబాబు నాయుడే అంటారు. చంద్రబాబు టీడీపీలో యాక్టివ్ అయ్యాకే.. రాష్ట్రంలో అశాంతియుత బంద్ లు, హింసాత్మక బంద్ లు జరగడం మొదలు కావడం చరిత్ర చెప్పే నిజం.
ఇక ఫ్యాక్షనిస్టు పరిటాల రవి హత్యకు గురి అయినప్పుడు టీడీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా అప్పట్లో వందల కొద్దీ ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు! ప్రజల ఆస్తులను బుగ్గి చేశారు. ఫ్యాక్షన్ లో మునిగి తేలిన పరిటాల రవి అదే ఫ్యాక్షన్ పులికి బలికాగా.. ప్రజల ఆస్తులకు నిప్పు పెట్టి ఆ వేడిలో రాజకీయ చలి కాచుకుంది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి హింసాత్మక బంద్ లు నిర్వహించిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయకత్వానికి. అలాంటిది ఇప్పుడు ఆయన శాంతి వచనాలు, శాంతీయుత బంద్ అంటున్నారు.
అయితే ఈ సారి చంద్రబాబు పిలుపుకు సొంత పార్టీ నేతలు కూడా కదల్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లు బంద్ నిర్వహణకు బయల్దేరేలోగా కొన్ని చోట్ల పోలీసులు వారిని హౌస్ అరెస్టులు చేయడం, తీసుకెళ్లి స్టేషన్ల పెట్టడం జరిగింది. ఇలా అరెస్టు అయిన వారు కూడా ఏపీ వ్యాప్తంగా చూసుకున్నా తక్కువమందే కావడం గమనార్హం. ప్రత్యేకించి రాయలసీమ విషయానికి వస్తే.. జిల్లాకు ఒకరిద్దరు నేతలు కూడా ఈ మేరకు అరెస్టు కాలేదు!
అనంతపురం జిల్లాలో కాలువ శ్రీనివాసులు హడావుడి చేశారు. ఇక్కడ టీడీపీ నేతల జాబితాను వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి వారిలో ఒకరిద్దరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మిగతా వాళ్లంతా పోలీసులకు అంత అవకాశం కూడా ఇవ్వలేదు! బంద్ అని చెప్పి వీళ్లే ఇళ్లలో ఉండిపోయారు కాబోలు. రాజకీయ పార్టీలు చెప్పాయని ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లు పాటించే రోజులు కావివి. ఆ మాత్రం నమ్మకాన్ని పార్టీలు ఎప్పుడో కోల్పోయాయి. ఏ పార్టీ అయినా బలవంతంగా బంద్ చేయించాల్సిందే! గతంలో వరస పెట్టి బస్సులను కాల్చిన టీడీపీ నేతలకు ఇప్పుడు అంత ఓపికలు కాదు కదా, బంద్ అంటూ రోడ్ల మీదకు వచ్చే ఓపిక కూడా లేనట్టుగా ఉంది.
ఇక కడప జిల్లాలో బంద్ ఊసే లేదు. అక్కడ టీడీపీ తరఫున అంత యాక్టివ్ నేతలెవరూ లేరిప్పుడు. ఇక ఆశ్చర్యకరంగా కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ ముఖ్య నేతలెవరూ కదల్లేదు. తాము కదిలితే పోలీసులు ఎక్కడ తీసుకెళ్లి స్టేషన్లో పెడతారో, ఇప్పుడు అంత రిస్క్ కూడా ఎందుకన్నట్టుగా అసలు బంద్ వార్తల్లోకి వారు ఎక్కనే లేదు. దీనికి చిత్తూరు జిల్లా కూడా మినహాయింపు కాదు. ఇలా నాలుగు జిల్లాల వ్యాప్తంగా చూస్తే.. నలుగురైదుగురు నేతలు కూడా బంద్ చేయించడానికి అంటూ బయటకు రాకపోవడం గమనార్హం.
ఒకవైపు చంద్రబాబేమో తను ఇచ్చిన బంద్ పిలుపుకు ఇతర పార్టీలు కూడా మద్దతుగా రావాలని కోరారు. అటు కమ్యూనిస్టులు, ఇటు బీజేపీ వాళ్లను కూడా చంద్రబాబు ఆ పిలుపుతో మద్దతు కోరినట్టుగా ఉన్నారు. ఆ పార్టీలు కిమ్మనలేదు, ఆ పార్టీల సంగతెలా ఉన్నా.. టీడీపీ తరఫు మాజీ మంత్రులు, కంచుకోటల్లోని మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ అధినేత పిలుపుకు అనుగుణంగా కదలకపోవడం అసలైన విశేషం. రెండున్నరేళ్లుగా స్తబ్ధుగా మారిన టీడీపీ నేతలు అదే తీరును కొనసాగిస్తూ ఉన్నట్టున్నారు!