తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాకా.. నెల కూడా గడవక ముందే పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు! పచ్చకండువాలు పక్కన వేసి, కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఒక వెలుగు వెలిగిన వారు, చంద్రబాబుకు అపర భక్తులుగా పని చేసిన వారు ఇందులో ముందున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యులతో పాటు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాజ్యసభ సభ్యులను అయితే చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపించారనే అభిప్రాయాలున్నాయి. బీజేపీ నుంచి తనకో వాయిస్ ఉండటానికి తన పార్టీ నేతలను, తనకు నమ్మకస్తులను చంద్రబాబు నాయుడు బీజేపీలోకి పంపించారని టాక్ ఉంది.
ఇలాంటి రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే! ఇక చంద్రబాబు పంపిన వారే కాకుండా, తమ వ్యక్తిగత వ్యవహారాలతో కొందరు బీజేపీలోకి చేరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే మంచిదన్నట్టుగా కొందరు, పెండింగ్ కాంట్రాక్టు బిల్లుల కోసం ఇంకొందరు తాము కూడా బీజేపీ అనిపించుకున్నారు!
అయితే ఇప్పుడు అలాంటి వారి చూపు మళ్లీ తెలుగుదేశం మీద పడినట్టుగా ఉంది. ఎన్నికలు అయిపోయి రెండున్నరేళ్లు అవుతున్నాయి. కాస్త ముందస్తుగానే ఎన్నికలు వస్తాయేమో అనే లెక్కలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో… తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వీలైనంత త్వరగా చేరిపోవడానికి బీజేపీలోని పాత పచ్చచొక్కాలు ముహూర్తాలను చూసుకుంటున్నారట. వీరిలో కొందరు ఇప్పటికే చంద్రబాబుతో రెగ్యులర్ గా టచ్లో ఉన్న వారేనని తెలుస్తోంది.
ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో వారు స్టే చేస్తున్నారు. ఈ వాసం ముగియగానే వీరు తిరిగి పచ్చ కండువాలు మెడలో వేసుకుని ఊరేగడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
అలాగే వీరికి తమ సొంత నియోజకవర్గాల టికెట్లు కూడా రిజర్వ్ అయినట్టుగా భోగట్టా. వీరు ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా టీడీపీ తరఫున ఆయా నియోజకవర్గాలకు వేరే వాళ్లను ఇన్ చార్జిలుగా ప్రకటించినా, ఆ ఇన్ చార్జిలంంతా తాత్కాలికమే అని, బీజేపీ నుంచి తిరిగి టీడీపీలోకి వెళ్లగానే వీరికే టికెట్లు ఖరారు అవుతాయనే మాట కూడా వినిపిస్తూ ఉంది.
ఇదీ టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల కథ. రాజ్యసభ సభ్యులు కూడా తమ పదవీ కాలం పూర్తి కాగానే చలో తెలుగుదేశం అననున్నారని సమాచారం. ఇలాంటి చేరికలను చూసుకుని బీజేపీ తను బలోపేతం అయినట్టుగా ఊహించుకుంటుంటే, చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం బీజేపీని తమ అవసరానికి ఒక బెంచ్ లా వాడుకుంటున్నట్టున్నారు!