టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగం వింటే ఉత్తర కుమారుడి ప్రగల్భాలు గుర్తుకొస్తాయి. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా వేదికపై నుంచి లోకేశ్ ప్రసంగం ఆద్యంతం ప్రగల్భాలతో సాగింది.
అధికార పార్టీ వైసీపీతో పాటు పోలీసులను బెదిరించి అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలనే ఎత్తుగడ కనిపించింది. లోకేశ్ ఆలోచనలు ఏవైనా, ఆయన ప్రసంగం విన్న వాళ్ల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.
“అయ్యా జగన్‌రెడ్డి నీ తాడేపల్లి కొంపలో పడుకోవడం కాదు. టిడిపిపై దాడి చేయాలని వుంటే, నువ్వే నేరుగా రా.. నీ ఇంట్లో పెంపుడు కుక్కల్ని పంపిస్తే… 10 నిమిషాలలో పిల్లుల్లా పారిపోతారు. తెలుగుదేశంలో ఇప్పుడు యువరక్తం ఉరకలెత్తుతోంది. ఎవ్వరూ ఊరుకోరు. ఒక చెంపపై కొడితే రెండు చెంపలు పగల కొడతాం. చట్టాల్ని ఉల్లంఘిస్తూ.. మా కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్లు… దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టం. సీఎం జగన్‌రెడ్డికి దమ్ముంటే పోలీసుల్లేకుండా టిడిపి కార్యాలయం వైపు రావాలి. ఎవరూ లేని సమయంలో టిడిపి ఆఫీసుపై రాళ్లేసి, ఉద్యోగుల్ని కొట్టి వెళ్లడం కాదు…దమ్ముంటే ఇప్పుడు రండి…మా సత్తా చూపిస్తాం” అని లోకేశ్ ఉగ్రరూపం దాల్చారు.
ఒక చెంపపై కొడితే రెండు చెంపలు పగలగొట్టేంత ధైర్యం, టీడీపీ ఆఫీస్‌కు వస్తే సత్తా చూపుతాం అని బీరాలు పలుకుతున్న నారా లోకేశ్‌కు ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని ఎందుకు అనిపించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో యువరక్తం ఉరకలేస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థలను బహిష్కరించాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
అంతెందుకు బద్వేల్ ఉప పోరు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో జవాబు చెప్పాలని నెటిజన్లు, పౌర సమాజం ప్రశ్నిస్తోంది. అసలు వైసీపీ అడగకుండానే పోటీ నుంచి తప్పుకోవడం పిరికితనం కాదా? అని నిలదీసే వాళ్లకు లోకేశ్ సమాధానం ఏంటి? బోస్డీకే అంటే బాగున్నారా అనే అర్థమని టీడీపీ నేతలు సరికొత్త నిర్వచనం ఇచ్చిన సంగతి తెలిసిందే.
బహుశా లోకేశ్ మాటల్లోని దమ్ము, ధైర్యం, రా తేల్చుకుందాం అనే పదాలకు ఎన్నికలు బహిష్కరించడం, పలాయనం చిత్తగించడం, ట్విటర్లో కాలం గడపడం లాంటి అర్థాలేమైనా వస్తాయా? అని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇవేవీ కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన తర్వాత బహిష్కరణ పిలుపు ఎందుకిచ్చారు? బద్వేల్ ఉప పోరుకు అభ్యర్థిని కూడా ప్రకటించి చివర్లో ఎందుకు వెనక్కి తగ్గారనే ప్రశ్నలకు ఆన్సర్ ఫ్లీజ్!