విమర్శలను కాచుకోవడంలో ఒక్కో నాయకుడిదీ ఒక్కో స్టైల్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు కొంతమంది, మరికొంతమంది మిన్ను విరిగి మీదపడ్డా వణకరు, తొణకరు. ఇక మూడోబ్యాచ్, వివరణ ఇచ్చామని అనుకుంటారు కానీ, ఆ వివరణతోనే అడ్డంగా బుక్కైపోతారు. నారాలోకేష్ కూడా ఇంతే.. తన చిరుతిళ్ల (స్నాక్స్) బిల్లు పాతిక లక్షలపై ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు చినబాబు. కామెడీగా తన పరువు తానే తీసుకున్నారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో లోకేష్ అండ్ టీమ్ స్నాక్స్ బిల్లు పాతిక లక్షలు అయిందని, బకాయిలు కట్టాలని ప్రస్తుత ప్రభుత్వానికి నివేదికలందేసరికి విషయం బైటపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని లోకేష్ పై ఒత్తిడి వచ్చేసరికి సహజంగానే తనకు అలవాటైన ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టారు. లోకేష్ స్నాక్స్ బిల్లు పాతిక లక్షలు అంటే.. అంత తిండీ లోకేష్ ఒక్కరే తిన్నారని కాదు అర్థం. లోకేష్ పేరుతో అయిన ఖర్చు అని మాత్రమే అర్థం. అయితే చినబాబు మాత్రం స్నాక్స్ బిల్లు ఇచ్చిన టైమ్ లో నేను అసలు విశాఖలోనే లేను విస్తృత పర్యటనల్లో ఉన్నానంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు.
మర్డర్ జరిగిన టైమ్ లో నిందితుడు వేరే ఊర్లో ఉన్నానంటూ ఎన్ని దొంగ సాక్ష్యాలయినా పుట్టించొచ్చు. అలాగే లోకేష్ కూడా ట్విట్టర్ ప్రూఫ్ లని బైటపెట్టారు. తమ జాతి మీడియా ఏబీఎన్ లో వచ్చిన క్లిప్పింగ్ ని జతచేసి చూపించారు. అసలు వీటిని ఆధారాలంటారా? ఇలాంటి ఆధారాలు చూపించే బదులు లోకేష్ సైలెంట్ గా ఉండి ఉంటే బాగుండేది, ట్విట్టర్ పోస్టింగ్ లు, టీవీ క్లిప్పింగ్ లు చూపించి లోకేష్ తన పరువు తానే తీసుకున్నారు.
లోకేష్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లోకేష్ స్వయంగా తినొచ్చు, తినకపోవచ్చు. కానీ బిల్లు మాత్రం లోకేష్ పేరుమీదే వచ్చింది. పోనీ తప్పు చేశారు సరే, తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలాగోలా చెల్లింపులు చేయొచ్చు కదా. తప్పులన్నీ తవ్వితీస్తామంటున్న జగన్ దగ్గరకే ఇలాంటి పంచాయితీ రావడం లోకేష్ ఖర్మ కాక ఇంకేంటి? అందుకే ఇలా స్నాక్స్ బిల్లు పేరుతో బజారునపడ్డారు. దానికి వివరణ అంటూ మరింతగా తన పరువు తానే తీసుకుంటున్నారు.