మంత్రి పదవుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన సొంత వర్గాన్నే దూరంపెట్టారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకు 50శాతం పైగా పదవులిచ్చి.. మిగతావి అగ్రవర్ణాలకు సర్దుబాటు చేశారు. రాష్ట్రమంతా ఈ మంత్రివర్గ కూర్పుపై హర్షం వ్యక్తంచేసింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు మంచి రోజులొచ్చాయని సంబరపడ్డారు ప్రజలు. కానీ వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం మాత్రం దీనిపై గుర్రుగా ఉంది.
పదవుల విషయంలో రెడ్డి సామాజిక వర్గం జగన్ పై అసంతృప్తితో ఉందనే విషయం కేబినెట్ కూర్పు నుంచి కథనాల రూపంలో బయటకొచ్చింది. అయితే దీనిపై ఎవరూ బాహాటంగా విమర్శలు చేయలేదు. ఎవ్వరూ రోడ్డుకెక్కలేదు. అయితే ఆ అసంతృప్తి ఇప్పుడు మెల్లమెల్లగా పైకి కనిపిస్తోంది. జిల్లాల్లో అంతర్గత వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. బీసీలు, రెడ్ల మధ్య అంతర్గత పోరు ఇప్పుడు పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతోంది.
తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన సాగునీటి మండలి సమావేశంలో ఈ విభేదాలు బైటపడ్డాయి. జిల్లానుంచి బీసీ ఎమ్మెల్యే అనిల్ మంత్రి కావడంతో. సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి నొచ్చుకున్నారు. ఎంపీ ఆదాలతో కలసి ఓ గ్రూపు కట్టి రాజకీయం చేస్తున్నారు. ఇటీవల అనిల్ కు మద్దతుగా ఉన్న కోటంరెడ్డితో వీరికి రాజకీయ విభేదాలు రావడానికి కూడా కారణం ఇదే. తాజాగా జరిగిన మీటింగ్ లో ఆనం, కాకాణి నీటి పంపకాలపై రచ్చచేసి బైటకు వెళ్లిపోయారు.
సోమశిల నిండుగా ఉన్నా నీటి పంపకాలు సరిగ్గా జరగడంలేదని బహిరంగంగా విమర్శలు చేశారు. తమ ప్రశ్నలకు మంత్రి అనిల్ సమాధానం చెప్పే టైమ్ లో ఈ ముగ్గురూ బైటకి వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి అనిల్ ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర మీ పెద్ద రెడ్లంతా గ్రూపు కట్టారుగా అని వ్యాఖ్యానించడం వీరి మధ్య విభేదాలను బలపరుస్తోంది. ఇది నెల్లూరు జిల్లాకే పరిమితమైన అంశం కాదు. ఆమధ్య రోజా అలకకు కూడా కారణం ఇదే.
ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గమంతా తమకు మంత్రి పదవుల్లో సరైన వాటా దక్కలేదని అసంతృప్తితో ఉంది. అలాగని జగన్ దగ్గర బైటపడలేరు, సొంత జిల్లాల్లో మంత్రులుగా ఉన్న జూనియర్ల ఆధిపత్యాన్ని ఒప్పుకోనూ లేరు. ప్రస్తుతానికైతే ప్రతి జిల్లాలోనూ అసంతృప్త గ్రూప్ ఒకటి తయారవుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ అసమ్మతిపై ఎంత త్వరగా దృష్టిపెడితే అంత మంచిది.
రెండోదఫా అయినా జగన్ వీరిని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి. చంద్రబాబు హయాంలో ఇలా జరగలేదు, ఆయన తన సామాజికవర్గం కమ్మలకు బాగానే ప్రాతినిథ్యం కల్పించారు. జగన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం సామాజిక వర్గాల సమీకరణాల్ని ఆయన పట్టించుకోలేదు.