టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ 2024లో తాను పోటీ చేసే నియోజకవర్గం ఏంటో తేల్చేశారు. ఇందుకు తన తండ్రి చంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష వేదికైంది.
లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ ఓటమిపాలయ్యారు.
టీడీపీ అధికారం నుంచి దిగిపోవడంతో పాటు ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ అధ్యక్షుడైన లోకేశ్ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకి తీవ్ర ఆవేదన కలిగించింది. మొదటి నుంచి మంగళగిరిలో తెలుగుదేశానికి పట్టులేదనే వాదన ఉంది. అలాంటి చోట లోకేశ్ నిలిచి అనవసరంగా అభాసుపాలయ్యారని టీడీపీ నేతలే పలు సందర్భాల్లో చెప్పారు. 2024లో మంగళగిరి నుంచి లోకేశ్ మకాం మారుస్తారని అంతా అనుకున్నారు.
గెలుపునకు ఢోకా లేని నియోజకవర్గాన్ని లోకేశ్ ఎంచుకుంటారని అంతా భావించారు. అయితే తాను 2024లో మంగళగిరి నుంచే పోటీ చేయడంతో పాటు గెలిచి కానుకగా ఇస్తానని లోకేశ్ తేల్చి చెప్పారు.
వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపామని, సినిమా ముందుందని ఆయన 36 గంటల దీక్షా వేదిక నుంచి తీవ్ర హెచ్చరికలు చేశారు. గతంలో మోడీకి కూడా లోకేశ్ ఇదే రకమైన హెచ్చరికలు చేయడాన్ని జనం గుర్తు చేసుకోవడం గమనార్హం. మొత్తానికి లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఒక స్పష్టత వచ్చింది.