తనయుడి అధిక ప్రసంగం తండ్రికి చికాకు కలిగించింది. కొంత మంది వ్యక్తులకు కొన్ని ప్రసంగాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఆ మాటలు బాణాల్లా మనసుకు తగులుతూ నొప్పెడుతాయి. మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ వేదికగా టీడీపీ చేపట్టిన 36 గంటల దీక్షా వేదికపై నారా లోకేశ్ అధిక ప్రసంగం ఆయన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు తల పట్టుకునేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్ తన ప్రసంగంతో అనవసరంగా బాబు వెన్నుపోటు తుట్టెను కదిపారంటున్నారు. టీడీపీ శ్రేణుల్ని చూసి లోకేశ్ ఊగిపోయారు. రెచ్చిపోయి మాట్లాడారు. ప్రత్యర్థులతో పాటు పోలీసులకు ఘాటు హెచ్చరికలు చేశారు. రెండు చెంపలు వాయిస్తానని తేల్చి చెప్పారు.
‘పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం. కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలు మీరు గాయపరచలేరు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్యకేసు తేల్చాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.
జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదనడం ప్రత్యర్థులతో పాటు నెటిజన్లకు ఆయుధం ఇచ్చినట్టైంది. ‘ఔను, మీరు చెప్పింది నిజమే. సీఎం పదవి కోసం మీ నాన్నలా పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నాయకుడు లేడు’ అంటూ నెటిజన్లు సెటైర్స్ విసిరారు. ఈ సందర్భంగా పదవి పోగొట్టుకున్న సందర్భంలో చంద్రబాబు గురించి దివంగత ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను షేర్ చేయడం గమనార్హం.
‘అయ్యా లోకేశ్, మాట్లాడే ముందు కాస్త వెనుకా ముందు ఆలోచించు. ఒక వేలు ఎదుటి వాళ్ల వైపు చూపితే, మిగిలిన నాలుగు వేళ్లు మన వైపే చూపుతాయి’ అంటూ దివంగత ఎన్టీఆర్ చూపుడు వేలితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇలా అనేక మంది నెటిజన్లు ఈ ఒక్క వాక్యాన్ని తీసుకుని లోకేశ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం.