cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: నాట్యం

మూవీ రివ్యూ: నాట్యం

టైటిల్: నాట్యం
రేటింగ్: 1.5/5
నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బేహల్, అదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ తదితరులు
కథ: రేవంత్ కోరుకొండ
కెమెరా: రేవంత్ కోరుకొండ
ఎడిటింగ్: రేవంత్ కోరుకొండ
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: సంధ్యారాజు, దిల్ రాజు
దర్శకత్వం: రేవంత్ కోరుకొండ
విడుదల: 22 అక్టోబర్ 2021

సంప్రదాయ నాట్యం నేపథ్యంలో సినిమా అనగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేవి- సాగరసంగమం, స్వర్ణకమలం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు. 

నాలుగూ తీసింది ఒక దర్శకుడే. నాలుగింటిలోనూ ఉన్నది ఒక నాట్యమే. అయినా నాలుగూ హిట్లే. ఇప్పటికీ, ఎప్పటికీ క్లాసిక్స్ గా మిగిలిన సినిమాలవి. 

ఆ కోవలో వచ్చిన సినిమాలు - కల్పన, మయూరి, ఆనందభైరవి, సప్తపది గురించి కూడా చెప్పుకోవచ్చు. 

ఇన్నాళ్ల తర్వాత "నాట్యం" పేరుతో అటువంటి సినిమా ఒకటొస్తోందన్న ఆసక్తి ఒక వర్గం ప్రేక్షకులకి కలిగింది.

సుప్రసిద్ధ పారిశ్రామకవేత్తల కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాజు శాస్త్రీయ నాట్యం నేపథ్యంలో నటించి, నిర్మించిన చిత్రం అనగానే ఒక మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. 

ప్రచారానికి సంబంధించిన ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడిన తీరు కూడా ఆమెలో చాలా విషయాల్లో క్లారిటీ ఉన్నట్టు కనపడింది. మరి ఆ క్లారిటీ ఫిల్మ్ మేకింగ్ లో ఉందా అంటే...

ఎంచుకున్న కథలో కండబలం లేదు. కథనానికి నరాల్లో బలం లేదు. ఇంకేం నాట్యం చేస్తుంది సినిమా? 

గతంలో ఎవరింటికైనా వెళితే పెళ్లి ఫోటోల ఆల్బం అని, యాత్రలకు వెళ్ళొచ్చిన ఫోటోలని కూర్చోపెట్టి చూపించేవారు. వాళ్ల గోల మనకి ఆసక్తి లేకపోయినా చేతిలో పనే కాబట్టి కాస్త స్పీడుగా చూసేసి కృత్రిమంగా అభినందించేసే పరిస్థితుండేది. 

కానీ ఎప్పుడైతే వీసీపీలు, సీడీలు వచ్చాయో కూర్చోపెట్టి గంటన్నర సేపు పెళ్లి వీడియో బాదేవాళ్లు. పూర్తిగా చూడలేక, ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యలేక బలవంతంగా కూర్చోవాల్సొచ్చేది. పెళ్లికూతురు చూడముచ్చటగా ఉన్నా ఆకట్టుకోని పెళ్లికొడుకుని మిగతా యాంబియన్స్ ని చూడలేక నీరసమొచ్చేది. 

ఈ "నాట్యం" చూస్తే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. 

సంధ్యారాజుగారి నాట్యప్రతిభ చూపించుకోవడం కోసం తీసిన సినిమా ఇది. ఆమె నాట్యం నిజంగా బాగుంది. అందులో వంకలు పెట్టేంత సాగరసంగమం కమలహాసన్ స్థాయి సమీక్ష కాదిది. ఆమె నాట్యం కనులవిందుగానే ఉంది. కానీ అందమైన తెల్ల పావురానికి మసి పూసినట్టు ఆమె నాట్య కౌశలానికి ఈ కథ అనే మసి పూయబడింది. 

ముప్పై నలభై ఏళ్ల క్రితం డ్యాన్స్ మీద తీసిన సినిమాలు ఎందుకాడాయి? అందులో ఎటువంటి భావోద్వేగాలున్నాయి? లాంటి స్టడీ ఏమాత్రం చేయకుండా చేతిలో డబ్బుంది కదా అని సెట్స్ మీదకి వెళ్లిపోయి సినిమా తీసేస్తే వచ్చే అప్రతిష్ట గురించి ఆలోచించకపోవడం దురదృష్టం. 

సంధ్యారాజు ఆసక్తికి, నాట్యం మీదున్న భక్తికి మెచ్చుకుని తీరాలి. కానీ ఆమె సరైన కథ-కథనాల్ని ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. 

మొదటి పాటని చిత్రీకరించడంలో పెట్టిన శ్రద్ధ మిగతా సినిమా అంతా పెట్టుండాల్సింది. 

నాట్యంలో నటనుంటుంది. కానీ సినిమా నటనకి అదొక్కటీ సరిపోదు. ఏ ఎక్స్ప్రెషన్ ఎంత మోతాదులో ఇవ్వాలి అన్న దాని మీద నటులతో పాటు దర్శకుడికి కూడా పూర్తి అవగాహన ఉండాలి. ఆ అవగాహనా లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక్కడ. 

ఒక్కచోట కూడా బలమైన భావోద్వేగం కలిగించే సీన్ కాని, శ్రద్ధగా చూడాలని ఆసక్తి కలిగించే సన్నివేశం కానీ లేదిందులో. చాలాచోట్ల టీవీ సీరియల్ ని తలపించే సాగతీతలు కూడా ఉన్నాయి. 

అలవాటైన మొహాలు, సీనియర్ నటులు కాబట్టి కమల్ కామరాజు, ఆదిత్య మీనన్ ల నుంచి పెద్దగా కంప్లైంట్స్ కనపడవు. కానీ బాయ్ ఫ్రెండుగా చేసిన రోహిత్ బేహాల్ మాత్రం యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళొస్తే మంచింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. "పోనీ పోనీ" పాటని చక్కగా స్వరపరిచాడు. పాటల్లో నాట్యాలన్నీ బాగున్నాయి. 

టెక్నాలజీ ఎంత పెరిగినా నేటి తరం కథకుల్లో గుండెలకి హత్తుకునేలా కథ చెప్పగలిగే సృజనాత్మకత మాత్రం పెరగడం లేదని ఇలాంటి సినిమా చూస్తే అర్థమవుతుంది. 

సంధ్యారాజు ప్రొఫైల్లో అద్భుతంగా నిలవాల్సిన ఈ చిత్రానికి కథ, కూర్పు, కెమెరా, దర్శకత్వం అన్నీ తానై నడిపించాడు రేవంత్ కోరుకొండ. బహుశా వేరే పేరుపొందిన టెక్నీషియన్స్ కి ఈ బాధ్యతలు అప్పజెప్పితే ఇంత బాగా తీయరని భయపడి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 

అయితే ఇన్నేసి బాధ్యతలు ఒకేసారి మోయలేక ఆ బరువైన మూటల్ని ప్రేక్షకుల నెత్తి మీద పారేసి తలలు బొప్పి కట్టించేసాడు. 

"కథ, కథనం, భావోద్వేగం అన్నీ ఒకే చోట లగ్నమైనప్పుడే రససిద్ధి కలుగుతుంది. దర్శకుడి దృష్టి అవకాశం మీద, నటి దృష్టి తన నాట్యభంగిమల మీద, అందుకోబోయే చప్పట్ల మీద" అని సాగరసంగమం డయలాగ్ ని కాస్త మార్చుకుని నిట్టూర్చడమే చివరకు మిగిలింది. 

బాటం లైన్: లయ తప్పిన నాట్యం.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!