రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన కమ్మ సామాజిక వర్గానికి మిగిలిన ఏకైక సంతృప్తిని, ఆనందాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ మాయం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ కుట్రను టాలీవుడ్‌లోని మెజార్టీ కమ్మ సామాజిక వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి.
టాలీవుడ్‌లోని కాపులంతా ప్రకాశ్‌రాజ్‌ను, కమ్మ సామాజిక వర్గీయులంతా మంచు విష్ణును సపోర్ట్ చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘మా’ ఎన్నికల సమరం కాపు వర్సెస్ కమ్మ అనే స్థాయిలో క్రియేట్ అయ్యింది. ‘మా’ ఎన్నికల్లో ప్రచారం జరిగినంత కాకపోయినా .కులాలకు అతీతంగా జరిగాయంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
చివరికి కమ్మ సామాజిక వర్గం బలపరిచిన, అదే కులానికి చెందిన మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన ప్యానల్ మంచి ఫలితాలను సాధించింది. తమ వాడిని గెలిపించుకున్నామని, చిత్రపరిశ్రమలో ఎప్పటికైనా తమదే ఆధిపత్యమని మరోమారు నిరూపించుకున్నామనే విజయ గర్వం కమ్మ సామాజిక వర్గీయుల్లో కనిపించింది. మరోవైపు కాపులను మట్టి కరిపించామని వాళ్ల కళ్లలో ఓ సంతృప్తి.
ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపంతా ఏపీ అధికార పార్టీకి కట్టబెడుతూ ప్రకాశ్‌రాజ్ తాజాగా ఓ సంచలనం సృష్టించారు. ‘మా’ ఎన్నికల్లో వైసీపీ జోక్యం ఉందంటూ శుక్రవారం ప్రకాశ్‌రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎన్నికల హాల్లోకి వైసీపీ కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సదరు వైసీపీ కార్యకర్త సాంబశివరావు ఎన్నికల హాల్లో ఓటర్లను బెదిరించారంటూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివ రావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు.
జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. సాంబశివరావు బెదిరింపులకు సంబంధించి వీడియోలను త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్ సీసీటీవీ పుటేజీలను చూసి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు అప్పీల్ చేస్తూ ప్రకాశ్‌రాజ్ తాజాగా ట్వీట్ చేశారు. పోలింగ్ బూత్‌లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయాలని మరోసారి డిమాండ్ చేయడం విశేషం.
‘కృష్ణమోహన్ గారు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికల ఎలా జరిగాయి.. పోలింగ్ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి’ అని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించే బాధ్యత తీరిపోయిందని, మిగిలిన వాటితో తనకెంత మాత్రం సంబంధం లేదని కృష్ణమోహన్ పదేపదే చెబుతున్నారు.
కోర్టు డైరెక్షన్ మేరకు తాను సీసీ పుటేజీ ఇస్తానని ఆయన పేర్కొనడం విశేషం. మొత్తానికి మంచు విష్ణు విజయంలో వైసీపీ పాత్ర బలంగా ఉందని ప్రకాశ్‌రాజ్ చెప్పడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారో తెలియదు కానీ, ముఖ్యమంత్రి జగన్ అక్కడ కూడా తనకు పలుకుబడి ఉందని చాటుకున్నట్టు అవుతుంది.