ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, నువ్వొక తిట్టు తిడితే తాము పది తిడతామనే రీతిలో ప్రధాన రాజకీయ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు తెరలేపాయి.
చంద్రబాబు 36 గంటల దీక్షా వేదికపై నుంచి అధికార పార్టీ నేతలను టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనాగ్రహం దీక్షా వేదికలపై నుంచి టీడీపీ నేతల వైఖరిని వైసీపీ నేతలు తూర్పార పడుతున్నారు.
అయితే చంద్రబాబును మామ వెన్నుపోటు నీడలా వెంబడిస్తోంది. అప్పట్లో తనను పదవీచ్యుతుడిని చేసిన అల్లుడైన చంద్రబాబుపై ఎన్టీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఔరంగజేబు కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని దివంగత ఎన్టీఆరే విమర్శించారు.
అలాగే ఇంతటి నికృష్ట, నీచమైన వ్యక్తి ప్రపంచంలో మరెక్కడా ఉండరని స్వయంగా చంద్రబాబే చెప్పారని, ఇక ఆయన్ను తిట్టడంలో తనది రెండో పాత్ర అంటూ మంత్రి కొడాలి నాని ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇంకా చంద్రబాబు గురించి నాడు దివంగత ఎన్టీఆర్ ఎంత దారుణ కామెంట్స్ చేశారో ఒక్కొక్కటిగా కొడాలి నాని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మంత్రి అవంతి తెరపైకి తెచ్చి విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విశాఖలో రెండో రోజు చేపట్టిన జనాగ్రహ దీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో ముడిపడి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అవంతి చెప్పారు. ఇదిలా ఉండగా అవంతి శ్రీనివాస్ గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్న అదృష్టవంతుడిగా అవంతికి పేరుంది. ఎందుకంటే మొదటి వైసీపీలో ఉన్న వాళ్లు కూడా మంత్రి పదవులకు నోచుకోలేదు.