టీడీపీ ఏదో రకమైన దీక్ష చేపడితే తప్ప నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమె పార్టీ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కొంత కాలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా అధికార ప్రతినిధి పట్టాభి ఆజ్ఞ లేనిదే ఇతర అధికార ప్రతినిధులెవరూ మీడియాతో మాట్లాడలేని దుస్థితి నెలకుంది.
పట్టాభి నియంతృత్వ పోకడపై దివ్యవాణి కోపంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో రకరకాల ప్రచారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా వేదికపై ఆమె మెరుపు తీగలా మెరిశారు.
నాయకుల మెప్పు కోసం ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఇసుక కొరతతో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని దివ్యవాణి ఆరోపించారు. యువకులకు ఉద్యోగాలు లేవన్నారు. ఒక్క ఛాన్స్‌తో వచ్చి ప్రజలను మోసం చేసినందుకు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం గమనార్హం.
అమరావతి రైతులను రోడ్లపై కూర్చోబెట్టినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్, చంద్రబాబు నాయుడి ఆధార్‌లు చింపేస్తామన్న వైసీపీ వాళ్లు నాలుకలు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. మిగిలిన రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే జగన్ రెడ్డి నాయకుడని ఒప్పుకుంటామని ఆమె అనడం విశేషం.
బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…నిరుద్యోగ యువతకు ఏం చేశారో చెప్పి వుంటే బాగుండేది. ప్రతిదానికి జగన్ క్షమాపణ చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేయడాన్ని నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఇంకా నయం జగన్‌ను ఎన్నుకున్నందుకు ప్రజలు క్షమాపణ చెప్పాలని దివ్యవాణి అలవాటులో పొరపాటుగా డిమాండ్ చేయలేదని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.