పరిటాల సునీతకు రక్తం ఉడుకుతోందట! చంద్రబాబు ఊ…అంటే మంత్రులను తిరగనివ్వమని మాజీ మంత్రి అయిన పరిటాల సునీత హెచ్చరించడం గమనార్హం. సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అవాకులు చెవాకులు పేలడం ఏపీలో ఉద్రిక్త రాజకీయాలకు తెరతీసింది. దానికి ఆజ్యం పోస్తూ చంద్రబాబు తన మార్క్ 36 గంటల దీక్షకు దిగారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా వేదికపై పరిటాల సునీత ఆవేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగానికి దిగారు. వైసీపీ అరాచకాలను ఇన్నాళ్లు ఓపికతో భరించామన్నారు. ఇకపై వారి అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగిలేవారు కాదన్నారు.
తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవిని చంపినవాళ్లు రోడ్లపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదన్నారు. చంద్రబాబుపై ఉన్న గౌరవం కారణంగా సహనంతో ఉన్నామన్నారు. ఇప్పుడు తమ రక్తం ఉడుకుతోందని ఆవేశపడ్డారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలన్నారు.
చంద్రబాబు ఊ.. అంటే మంత్రులను తిరగనివ్వమని ఆమె హెచ్చరించారు. తిట్లు తమకూ వచ్చని, తామూ మాట్లాడగలమన్నారు. తమకూ బీపీ వస్తోందని ఏం చేస్తామో త్వరలో చూపిస్తామని వైసీపీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు.
తనను, తన తల్లిని బూతు మాటలతో తిట్టడం వల్ల అభిమానుల్లో బీపీ పెరిగి ప్రతిస్పందించారని సీఎం జగన్ మాటలకు పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. అయితే పరిటాల రవిని చంపిన వాళ్లు కూడా రోడ్డుపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదని పరిటాల సునీత అనడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పరిటాల రవి హత్య కేసులో తాను నిందితుడిగా పేర్కొన్న జేసీ దివాకర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో పరిటాల సునీత తెలుసుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని పరిటాల చేసిన దారుణాల మాటేంటని ప్రశ్నిస్తున్నారు.