రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ల మధ్య అమీతుమీ పోరుగా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలోనే ఉంది. అయితే ఆ పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోకొంత పునరుత్తేజాన్ని కలిగించేలా ఉన్నాయి ఫలితాలు. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే హస్తం పార్టీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం దిశగా సాగుతుండం ఆసక్తిదాయకంగా మారింది.
అర్లీ ట్రెండ్స్ లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కోలుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు.. హర్యానాలో 90 సీట్లకు గానూ కాంగ్రెస్ 32 సీట్లలో, బీజేపీ 39 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 12 సీట్లలో ముందంజలో ఉన్నారు. గత పర్యాయం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ స్వల్పమైన సీట్లకే పరిమితం అయ్యింది. అయితే ఇప్పుడు మెరుగైన ప్రతిపక్ష హోదా అయినా దక్కడం ఖాయమైనట్టే. పూర్తి ఫలితాలు వెల్లడి అయితే అసలు కథ అర్థం అవుతుంది.
ఇక మహారాష్ట్రలో మాత్రం భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతూ ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ, శివసేనల కూటమి 122 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూటమి 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 12 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 145. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి భారీ ఎత్తున నేతలను చేర్చుకుంది బీజేపీ. అయితే ఆ పార్టీల సహజమైన బలాన్ని కమలం పార్టీ దెబ్బతీయలేకపోయిందని స్పష్టం అవుతోంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు అధికారానికి మాత్రం ఆమడదూరంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.